logo

మానవ తప్పిదాలే.. ‘మాను’కు శాపాలై

నగరంలో ఎప్పుడు ఏ చెట్టు కూలుతుందో తెలియట్లేదు. చిన్న గాలి వచ్చినా.. తేలికపాటి వర్షం కురిసినా కనీసం పది చెట్లు నేలకూలుతున్నాయి.

Published : 25 May 2024 06:00 IST

అశాస్త్రీయంగా నరకడంతో కూలుతోన్న చెట్లు
విద్యుత్తు శాఖ, జీహెచ్‌ఎంసీ మధ్య సమన్వయలేమి

ఖైరతాబాద్‌లో అడ్డదిడ్డంగా కొమ్మలు  తొలగించడంతో రోడ్డుపైకి వాలిన వృక్షం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఎప్పుడు ఏ చెట్టు కూలుతుందో తెలియట్లేదు. చిన్న గాలి వచ్చినా.. తేలికపాటి వర్షం కురిసినా కనీసం పది చెట్లు నేలకూలుతున్నాయి. వాటి కింద పడి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి లైట్లకు అడ్డొస్తున్నాయనిజీహెచ్‌ఎంసీ లేదా విద్యుత్తుశాఖ సిబ్బంది చెట్లను అడ్డదిడ్డంగా నరికేస్తుండటమే అందుకు ప్రధాన కారణం. చెట్ల ఎత్తు ఓ దశకు చేరుకున్నప్పట్నుంచి.. వాటి కొమ్మలను ఒకే వైపున తొలగిస్తుండటం వల్ల.. అవతలి వైపున చెట్ల కొమ్మలు పెరిగిపోయి గాలిదుమారానికి కుప్ప కూలుతున్నాయి.

23 రోజుల్లో.. 625 చెట్లు.. రెండు వారాలుగా నగరంలో అడపాదడపా బలమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. దాని కారణంగా ఈనెల 1 నుంచి 23వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 625 చెట్లు నేల కూలినట్లు  విపత్తు స్పందన దళం(డీఆర్‌ఎఫ్‌) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. చెట్లు కూలిన ఘటనలపై తమకు ఫిర్యాదులొస్తుంటాయని, వాటిని ఎప్పటికప్పుడు తమ సిబ్బంది పక్కకు తొలగిస్తున్నారని ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు.

ఎందుకు కూలుతున్నాయి..?

జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్ల పక్కన వేలాది చెట్లు ఉన్నాయి. విద్యుత్తు తీగలను తాకేంత ఎత్తుకు పెరగగానే.. కొమ్మలను తొలగించాలన్నది నిబంధన. అయితే.. జీహెచ్‌ఎంసీ, విద్యుత్తుశాఖల సమన్వయ లేమితో కొమ్మలను తొలగించే ప్రక్రియ శాస్త్రీయంగా జరగట్లేదు.కొమ్మలను ఒక వైపున మాత్రమే నరుకుతుండటంతో..చెట్టంతా అవతలివైపు వాలిపోయి నేలపై కూలుతోంది. ఎవరికివారు చెట్లను ఇష్టానుసారం నరుకుతుండడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి.

నగరంలోని రోడ్లపై, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల్లోని ఖాళీ స్థలాల్లో ఎక్కువగా పెల్టోఫోరం, గుల్మొహర్‌ చెట్లు కనిపిస్తుంటాయి. స్పతోడియా, చిన్నబాదం, స్టెర్కులియా, రెయిన్‌ ట్రీ వంటి చెట్లు కూడా విరివిగా ఉంటాయి. వాటి వేర్లు పైపైన ఉంటాయని, కొమ్మలు పెలుసుగా ఉండడంతో  గాలివానలకు కూలుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని