logo

హెచ్‌ఎండీఏ పనుల్లో విద్యుదాఘాతంతో బాలుడి మృతి

హెచ్‌ఎండీఏ పనుల్లో విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందిన సంఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణాపరిధిలో జరిగింది. సంఘటనపై గుత్తేదారుతో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Published : 27 May 2024 03:19 IST

గుత్తేదారు నిర్లక్ష్యంపై కేసు నమోదు

శివకుమార్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: హెచ్‌ఎండీఏ పనుల్లో విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందిన సంఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణాపరిధిలో జరిగింది. సంఘటనపై గుత్తేదారుతో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనాథ్‌రెడ్డి కథనం ప్రకారం.. జనగాం జిల్లా చిల్‌పూర్‌కు చెందిన భార్యాభర్తలు జి.సుధాకర్, సునీతలు కార్మికులుగా పనిచేస్తూ తుకారాంగేట్‌ సమీపంలోని చంద్రశేఖర్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి పూజిత (19), శివకుమార్‌ (16) పిల్లలు. స్వగ్రామంలో ఎల్లమ్మ పూజ ఉండటంతో భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. ఇంట్లో కుమారుడు శివకుమార్‌ ఉండగా.. దగ్గరి బంధువైన శీను శనివారం రాత్రి అమీర్‌పేట మైత్రీవనం వద్ద హెచ్‌ఎండీఏ కొనసాగిస్తున్న పునరుద్ధరణ పనుల కోసం తీసుకువచ్చాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మైత్రీవనం ఆవరణలో మొక్కలు నాటడం కోసం గుత్తేదారు మహబూబ్‌ పాషా, సూపర్‌వైజర్‌ ఖదీర్‌ పాషాలు ట్రాక్టర్‌తో డిగ్గింగ్‌ (ట్రాక్టర్‌ బ్రేకర్స్‌) పనులను బాలుడు శివకుమార్‌తో చేయిస్తున్నారు. డిగ్గింగ్‌ చేస్తుండగా భూమిలో ఉన్న విద్యుత్‌ కేబుల్‌ తగలడంతో విద్యుదాఘాతం జరిగి శివకుమార్‌ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. తల్లి సునీత ఫిర్యాదు మేరకు సంఘటనలో బాలుడిని పనిలోకి తీసుకువచ్చిన బంధువు శివరాత్రి శ్రీనుతో పాటు గుత్తేదారు మహబూబ్‌ పాషా, సూపర్‌వైజర్‌ ఖదీర్‌ పాషాలపై వివిధ సెక్షన్లతో పాటు బాలకార్మిక చట్టం, జేజే చట్టాల కింద కేసు నమోదు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని