logo

పంపిణీ తక్కువ.. డిమాండ్‌ ఎక్కువ

వేసవి తుది దశకు వస్తున్నందున వానా కాలం (ఖరీఫ్‌) పనులకు రైతులు శ్రీకారం చుట్టారు. యాసంగిలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు సాగు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.

Published : 27 May 2024 03:41 IST

జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాల కొరత

సాగులో జనుము

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్, మున్సిపాలిటీ: వేసవి తుది దశకు వస్తున్నందున వానా కాలం (ఖరీఫ్‌) పనులకు రైతులు శ్రీకారం చుట్టారు. యాసంగిలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు సాగు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. నిస్సారంగా మారిన భూములను సారవంతం చేసేందుకు వారం రోజులుగా సేంద్రియ, కోళ్ల ఎరువుతో పాటు ఒండ్రుమట్టిని పొలాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ సైతం రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని యత్నిస్తోంది. ఇందులో భాగంగా  పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం రాయితీపై సరఫరా చేసి నాణ్యమైన ఉత్పత్తులతో పాటు అధిక దిగుబడులను అందించాలని శాస్త్రవేత్తలతో సూచనలు, సలహాలను అందిస్తోంది. కానీ డిమాండ్‌ తగినట్లుగా సరఫరా చేయకపోవడంతో విత్తనాల కోసం అవస్థలు పడుతున్నారు. 


రసాయనిక ఎరువులు వద్దని..

పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో వివిధ రకాల పంటలు కలిపి  ఆరు లక్షలకు పైగా సాగు కానున్నాయి. పచ్చిరొట్ట విత్తనాలు భూమికి బలం. ఒక డీఏపీ బస్తా రూ.1300 వరకు ఉండటంతో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. ఎకరాకు కనీసం రెండు బస్తాలు వినియోగిస్తున్నారు. అదే జీలుగ, జనుము అయితే అదనపు పోషకాలు అందిస్తాయి. ఈ విషయంలో క్రమేపి మార్పు రావడంతో విత్తనాలకు డిమాండ్‌ పెరిగింది. రసాయనిక ఎరువుల వినియోగంతో దిగుబడులు పడిపోవడంతో పాటు వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తులు విషతుల్యంగా మారుతున్నాయని గ్రహిస్తున్నారు. క్రమక్రమంగా పచ్చిరొట్ట విత్తనాలను చల్లుకుని నేల గుణగణాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • వ్యవసాయశాఖ 750 క్వింటాళ్ల జీలుగ, 897 క్వింటాళ్ల జనుము సరఫరా చేస్తోంది. జీలుగ విత్తనాలు 1800 క్వింటాళ్లు, జనుము 3800 క్వింటాళ్లకు అధికారులు ఇండెంట్‌ పంపారు. మొదటి విడతలో వీటిని పంపిణీ చేయగా రోజుల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి. రెండో దఫా సరఫరా జరగకపోవడంతో నిత్యం సమీప వ్యవసాయ కారాలయాలకు వచ్చి వెళ్తున్నారు. 
  • గతేడాది 4వేల క్వింటాళ్లకు పైగా డిమాండ్‌ ఉంటే రెండు రకాల విత్తనాలు కలిపి కేవలం 2300 క్వింటాళ్ల విత్తనాలే సరఫరా అయ్యాయి. పెరిగిన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం ఈసారైనా డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

రైతులకు అందుబాటులో ఉంచుతాం
గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి

విత్తనాలకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తో త్వరగా అయిపోయాయి. మళ్లీ తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచుతాం. విచ్చలవిడిగా వాడుతున్న రసాయనిక ఎరువులతో సేంద్రియ కర్బన పదార్థం భూమిలో తగ్గి రైతులకు మేలు చేసే సూక్ష్మక్రిములు లక్షల్లో చనిపోతున్నాయి. ఈ ప్రభావం దిగుబడులపై స్పష్టంగా పడుతోంది. పచ్చిరొట్ట పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ సాగును పెంచుతాం. భూసారం పెంచేందుకు జిల్లాకు తగినన్ని జీలుగ, జనుము విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. అన్నదాతల్లో వస్తున్న మార్పు ఆహ్వానించదగ్గ పరిణామం. రైతులందరూ ఇదే విధానాన్ని పాటించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని