logo

పక్కా లెక్క.. ఎగవేత కుదరదిక

జిల్లాలో జరిగే మైనింగ్‌ అక్రమాలకు ఇక సమూలంగా అడ్డు కట్ట పడబోతోంది. ఎవరు ఎంత ఖనిజం తవ్వారు? రాయల్టీ ఎంత చెల్లిస్తున్నారనే విషయం పక్కాగా తేలి పోనుంది.

Published : 27 May 2024 07:26 IST

మైనింగ్‌ శాఖలో డీజీపీఎస్, ఈటీఎస్‌ సర్వేకు శ్రీకారం

సుద్ద తవ్వి.. కుప్పగా పోసి.. 

న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్, పరిగి: జిల్లాలో జరిగే మైనింగ్‌ అక్రమాలకు ఇక సమూలంగా అడ్డు కట్ట పడబోతోంది. ఎవరు ఎంత ఖనిజం తవ్వారు? రాయల్టీ ఎంత చెల్లిస్తున్నారనే విషయం పక్కాగా తేలి పోనుంది. ఎక్కువ ఖనిజం తవ్వి తక్కువకు రాయల్టీ చెల్లించే వారికి తాఖీదులు జారీ చేసి మిగిలిన రాయల్టీని వసూలు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (డీజీపీఎస్‌), ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌ (ఈటీఎస్‌) సర్వేలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

లీజు పొందినవి 223 మాత్రమే..

జిల్లాలో లీజు పొంది ఖనిజాలను తవ్వుతున్న గనులు కేవలం 223 మాత్రమే ఉన్నాయి. అక్రమ ఖనిజాల తవ్వకాలు జరుగుతున్న గనులు 70కి పైగానే ఉన్నాయి. వీటిలో పెద్దేముల్, మోమిన్‌పేట, ధారూర్, బంట్వారం, నవాబుపేట, మర్పల్లి, వికారాబాద్‌ మండలాల్లో సుద్ద, లేటరైట్‌ గనులు ఎక్కువగా ఉన్నాయి. బషీరాబాద్, తాండూరు మండలాల్లో నాపరాయి గనులు కూడా ఉన్నాయి.

లీజు పొందిన గనుల్లో నాపరాయి 64, లేటరైట్‌ 75, సున్నపు రాయి 4, స్టోన్‌ మెటల్‌ 27, సుద్ద 41, గ్రానైట్‌ 6, షెల్‌ 1, క్వార్డ్జ్‌పెల్స్‌ పార్‌ 3, ఫైర్‌ క్లే 2 చొప్పున ఉన్నాయి. అన్ని గనుల నుంచి తవ్వుతున్న ఖనిజాల నుంచి జిల్లా గనుల శాఖకు రూ.121.01 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అయితే గనుల్లో భారీగా ఖనిజాలు తవ్వినా కొంత మాత్రమే తవ్వినట్లు ఆ మేరకు రాయల్టీ చెల్లిస్తున్నారు. అధికారులు కూడా యజమానులు చెల్లించిన రాయల్టీనే ఆదాయంగా భావిస్తూ వస్తున్నారు. జిల్లాలో తవ్వకాలు సాగిస్తున్న లేటరైట్, సున్నపు రాయిని సిమెంటు ఉత్పత్తికి కర్మాగారాలకు తరలిస్తున్నారు. సుద్దను మలేషియా, సింగపూరుకు నూనె శుద్ధి పరిశ్రమలకు, దేశంలోని ఎరువుల తయారీ కర్మాగారాలకు తరలిస్తున్నారు.  


హద్దులు దాటి తవ్వకం.. రూ.కోట్లలో అక్రమార్జన 

లీజు పొందిన గనుల పేరిట చాలా మంది యజమానులు పక్కనే ఉన్న స్థలాల్లో హద్దులు దాటి అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. వీటికి రాయల్టీ చెల్లించకుండా విక్రయాలు జరిపి రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు. మరో పక్క రాజకీయ పలుకు బడిని వినియోగించి కొందరు ప్రభుత్వ భూముల్లోనూ ఖనిజాలను తవ్వి విక్రయాలు జరుపుతున్నారు. అక్రమ తవ్వకాలపై అధికారులు పర్యవేక్షణ లేక పోవడంతో వ్యవహారం సాఫీగా సాగిపోతోంది. 


ఆదాయం పెంచనున్న సర్వేలు

కొత్తగా అమల్లోకి వస్తున్న డీజీపీఎస్, ఈటీఎస్‌ సర్వేల ద్వారా అక్రమ తవ్వకాలకు సమూలంగా కళ్లెం పడుతుంది. ఎంత ఖనిజం తవ్వితే ఆ మేరకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు అక్రమ మైనింగ్‌ను అధికారులు నిరోధిస్తారు. మొదట డీజీపీఎస్‌ సర్వే నిర్వహించి లీజు పొందిన గనిలో ఖనిజాలు తవ్వారా లేదంటే పక్క స్థలంలో తవ్వారా అనే విషయంలో నిర్ధరణకు వస్తారు. ఈటీఎస్‌ సర్వేలో లీజు పొందిన గనిలో ఇప్పటి వరకు ఎన్ని మెట్రిక్‌ టన్నుల ఖనిజాలు తవ్వారు? రాయల్టీ ఎంత చెల్లించారని క్షేత్రస్థాయి సర్వేల ద్వారా తేలుతుంది. వ్యత్యాసాలను బట్టి అధికారులు సదరు యజమానులకు తవ్విన ఖనిజాలకు రాయల్టీ చెల్లించాలని తాఖీదులు జారీ చేసి వసూలు చేస్తారు. దీంతో అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని