logo

కిరణ్‌ ఫెర్టిలిటీ సర్వీసెస్‌కు మొట్టికాయలు

ఒప్పందం ప్రకారం నడుచుకోకుండా అదనంగా డబ్బు వసూలు చేసిన కిరణ్‌ ఫెర్టిలిటీ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు హైదరాబాద్‌ కమిషన్‌-2 మొట్టికాయలు వేసింది.

Published : 27 May 2024 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒప్పందం ప్రకారం నడుచుకోకుండా అదనంగా డబ్బు వసూలు చేసిన కిరణ్‌ ఫెర్టిలిటీ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు హైదరాబాద్‌ కమిషన్‌-2 మొట్టికాయలు వేసింది. విశాఖపట్నానికి చెందిన విజయ్‌కుమార్‌కు ప్రతివాద కిరణ్‌ ఫెర్టిలిటీ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు మధ్య ఐవీఎఫ్‌ పద్ధతిలో సరోగసీకి 2017 డిసెంబరులో ఒప్పందం కుదిరింది. ఈ ప్రక్రియ అంతా కెన్యాలో మొంబాసాలో జరగాలన్నది ఫిర్యాదీ ప్రధాన అభ్యర్థన. ఇందుకు 40,500 యూఎస్‌ డాలర్లు చెల్లించేలా అంగీకరించారు. 2018 జనవరి నుంచి డిసెంబరు వరకు వేర్వేరు వాయిదాల్లో  ఫిర్యాదీ ఈ మొత్తాన్ని చెల్లించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతివాద సంస్థకు చెందిన ఫిజీషియన్‌ను నియమించారు. అయితే డెలివరీ సమయంలో ప్రతివాద సంస్థ 3,500 యూఎస్‌ డాలర్లు అదనంగా వసూలు చేయడంతో పాటు ఒప్పందానికి విరుద్ధంగా హాస్పిటల్‌ ఛార్జీలు వసూలు చేశారు. బిడ్డ జననం తర్వాత జనరల్‌ వార్డుకు తరలించారని ఫిర్యాదీ కమిషన్‌కు తెలిపారు. ఇందుకోసం ప్రతి రోజూ 150 యూఎస్‌ డాలర్లు వసూలు చేశారని పేర్కొన్నారు. విచారించిన కమిషన్‌ ఫిర్యాదీ నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బు రూ.2,62,500 రీఫండ్‌ చేయాలని, పరిహారంగా రూ.1,00,000, కేసు ఖర్చులు రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని