logo

దారి మూసేసి.. ధర పెంచేసి

నగర శివారుల్లో స్థిరాస్తి వ్యాపారులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీ పేరిట ఏకంగా కాలనీ రోడ్లనే కబ్జా చేస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేదు.

Published : 27 May 2024 04:13 IST

గేటెడ్‌ కమ్యూనిటీగా సృష్టించేందుకు రోడ్డు కబ్జా
బండ్లగూడజాగీర్‌ యాదాద్రి కాలనీలో రియల్టర్‌ బరితెగింపు

యాదాద్రి కాలనీకి వెళ్లే దారిలో నిర్మించిన విల్లాలు

న్యూస్‌టుడే, బండ్లగూడజాగీర్‌:  నగర శివారుల్లో స్థిరాస్తి వ్యాపారులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీ పేరిట ఏకంగా కాలనీ రోడ్లనే కబ్జా చేస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేదు. గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలకు మంచి డిమాండ్‌ ఉండటంతో బిల్డర్‌ నిబంధనలను తుంగలో తొక్కి కాలనీ రోడ్డును ఒకవైపు పూర్తిగా మూసేలా ప్రహరీ నిర్మించి గేటెడ్‌ కమ్యూనిటీగా మార్చేశాడు. 

గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కిస్మత్‌పూర్‌ రెవెన్యూలో చాలాకాలం క్రితమే యాదాద్రి కాలనీ వెలసింది. దీనికి ఆనుకొనే మరికొన్ని కాలనీలున్నాయి. కిస్మత్‌పూర్‌-ఎక్సయిజ్‌ అకాడమీ మార్గంలోని ఈ కాలనీకి 40 అడుగుల విస్తీర్ణంలో రోడ్డు ఉంది. ఈ మార్గంలోనే ఓ స్థిరాస్తి వ్యాపారి అర ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి రోడ్డుకు ఇరువైపులా పది విల్లాలు నిర్మించాడు. కాలనీ రోడ్డులో నిర్మాణాలు చేపట్టడంతో విల్లాలకు అనుకున్న డిమాండ్‌ రాలేదు. దీంతో ఆయనలో దుర్బుద్ధి మొదలైంది. రోడ్డును తన ఆధీనంలోకి తీసుకునేందుకు కార్పొరేషన్‌ యంత్రాంగాన్ని మచ్చిక చేసుకొని రాత్రికిరాత్రే.. విల్లాల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టాడు. స్థిరాస్తి వ్యాపారి విల్లాల నిర్మాణానికి ఇండిపెండెంట్‌ ఇళ్ల నిర్మాణాల పేరుతో అనుమతులు తీసుకొని 175 గజాల్లో ఒక్కో విల్లా నిర్మించాడు. బహిరంగ మార్కెట్‌లో ఇండిపెండెంట్‌ ఇళ్లకు చదరపు అడుగు రూ.4వేలు పలుకుతుండగా.. గేటెడ్‌ కమ్యూనిటీలో మాత్రం ఏకంగా రూ.7వేలు నుంచి రూ. 8 వేలు ధర పలుకుతోంది. ఒక్కో విల్లాను మార్కెట్‌లో రెండింతల ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. ఇందుకోసం అడ్డంకులను అధిగమించేందుకు కార్పొరేషన్‌లోని కీలక అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యాదాద్రి కాలనీ ప్రధాన రోడ్డు


కాలనీ వాసుల ఇబ్బందులు..

యాదాద్రి కాలనీకి చెందిన ప్రధాన రహదారిని స్థిరాస్తి వ్యాపారి కబ్జా చేయడంతో.. ఇక్కడి కాలనీవాసులు మరోకాలనీకి చెందిన రోడ్డులో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం గేటెడ్‌ కమ్యూనిటీలో అపార్టుమెంట్‌లు, విల్లాలు నిర్మించాలంటే కొనుగోలు చేసిన స్థలంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థలం వదిలిపెట్టాలి. ఇక కమ్యూనిటీ వాసులకు పార్కులు, ఇతరత్రా మౌలిక సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఇలాంటి నిబంధనలేవీ అమలు కాలేదు. కాలనీవాసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయమై కార్పొరేషన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ఏం చేయాలి సార్‌..! మా బాస్‌ మా విధులను నిర్వర్తించనివ్వడం లేదు. రియల్‌ వ్యాపారి చేస్తున్న మోసం మా దృష్టికి వచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం’ అని చెప్పడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని