logo

బోసినవ్వుల బాల్యం.. అమ్మకానికి బేరం

తల్లి పొత్తిళ్లలో సేదతీరాల్సిన పసికందుల్ని వస్తువులా అమ్మకానికి పెడుతున్నారు. చైల్డ్‌లైన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసులు నిరంతరం తనిఖీలు, ప్రత్యేక కార్యక్రమాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా..

Updated : 27 May 2024 06:54 IST

పేద తల్లిదండ్రులే లక్ష్యంగా.. ఆసుపత్రి సిబ్బందే దళారులుగా..
ప్రభుత్వ శాఖలు నిఘా పెడుతున్నా.. ఆగని దందా

ఈనాడు- హైదరాబాద్‌:  తల్లి పొత్తిళ్లలో సేదతీరాల్సిన పసికందుల్ని వస్తువులా అమ్మకానికి పెడుతున్నారు. చైల్డ్‌లైన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసులు నిరంతరం తనిఖీలు, ప్రత్యేక కార్యక్రమాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా.. చిన్నారుల్ని దొడ్డిదారిలో విక్రయించే ముఠాలు యథేచ్ఛగా తమ పనిచేసుకుంటూ వెళ్తున్నాయి. ఆడపిల్ల పుట్టిందని, పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని.. పోషణ భారం భరించలేమని భావించే తల్లిదండ్రులే లక్ష్యంగా కొన్ని ముఠాలు చెలరేగుతున్నాయి. ఆడపిల్లకు, అబ్బాయికి వేర్వేరు ధరలు నిర్ణయించి అమ్మేస్తున్నారు. తాజాగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల పసికందును విక్రయిస్తూ ముగ్గురు మధ్యవర్తులు పట్టుబడడం కలకలం రేపింది. ఇలా ఏటా వందలాది మంది చిన్నారుల్ని గుట్టుచప్పుడు కాకుండా బేరసారాలాడి అమ్మేస్తున్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. 

ఆసుపత్రుల దగ్గరే దందా..

ప్రధానంగా ఆసుపత్రులు, కొందరు దారి తప్పిన వైద్యులు కేంద్రంగా చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నాయి. నగరంలోని పేట్లబుర్జు, నిలోఫర్‌ సహా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర తిష్ఠ వేస్తున్న కొందరు కేటుగాళ్లు.. బేరసారాలకు తెరతీస్తున్నారు. ఏటా వేలాది మంది కాన్పులు, రోజుల వయసున్న చిన్నారులకు చికిత్స కోసం నగరంలోని ఆసుపత్రులకు వస్తుంటారు. వీరిలో కొందరు మూడు, నాలుగు కాన్పులైనా ఆడపిల్ల పుట్టిందని, ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని, అనారోగ్యంతో ఉన్న చిన్నారి పోషణభారం భరించలేమంటూ అక్కడే తోటివారితో మనోగతాన్ని పంచుకుంటుంటారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకునే కొందరు ఇతరులకు అమ్మేస్తామనో లేక దత్తత ఇప్పిస్తామనో నమ్మిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో కొందరు ప్రసూతి సేవలందించే సిబ్బంది ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు.  తాజాగా మేడిపల్లిలో ఉదంతంలో ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌ నిర్వహించే మహిళ దళారీ పాత్ర పోషించి చిన్నారిని అమ్మేందుకు ప్రయత్నించడం ఓ ఉదాహరణ. 

దత్తతకు ఆలస్యం

పిల్లలున్న నిరుపేదలు పోషణభారం ఇతర సమస్యలతో విక్రయిస్తున్నారు. మరోవైపు సంతానలేమి సమస్య ఉన్న దంపతులు దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా చిన్నారుల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ అడాప్షన్‌ రీసోర్స్‌ అథారిటీ (కారా) పేరుతో  చర్యలు తీసుకుంటోంది. చిన్నారుల దత్తత కోసం దరఖాస్తు చేసినా ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి రావడంతో  అడ్డదారిలో కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని శిశు విహార్‌లోని చిన్నారుల దత్తత కోసం 2050 మంది దరఖాస్తు చేసుకోగా... అక్కడున్నది 186 మంది శిశువులు మాత్రమే. చిన్నారి దత్తత కోసం సగటున 3-4 ఏళ్ల సమయం పడుతోంది. భారీ పోటీ వల్ల ఎక్కువ మంది ఆసుపత్రులు, వివిధ ప్రాంతాల్లో దళారులను సంప్రదిస్తుంటారు. చైల్డ్‌లైన్, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(ఏహెచ్‌టీయూ) తరచూ ప్రత్యేక ఆపరేషన్లతో నిఘా పెడుతున్నా పరిమితంగా ఉంది.  

గతేడాది ఆపరేషన్‌ ముస్కాన్‌ గణాంకాలు

కాపాడిన చిన్నారులు 2617
ఇందులో బాల కార్మికులు  1531
యాచకులుగా మారిన వారు  109 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని