logo

సెల్‌ఫోన్లు కొట్టేసి.. సూడాన్‌కు తరలించి

నగరంలో సెల్‌ఫోన్ల స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘరానా ముఠా ఆటకట్టించారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. సూడాన్‌ దేశస్థుడితో సహా 31 మందిని అరెస్టు చేశారు.

Published : 27 May 2024 04:21 IST

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో సెల్‌ఫోన్ల స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘరానా ముఠా ఆటకట్టించారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. సూడాన్‌ దేశస్థుడితో సహా 31 మందిని అరెస్టు చేశారు. రూ.2కోట్ల విలువైన 713 మొబైల్‌ఫోన్లు, ఆటో, 2 కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్‌ ఆదివారం మీడియాకు తెలిపారు.  ఇటీవల సెల్‌ చోరీ కోసం గుడిమల్కాపూర్‌లో దొంగలు ఒక యువకుడిని హత్య చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న నగర సీపీ శ్రీనివాసరెడ్డి మూలాలు చేధించమని టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించారు. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఇక్కడి సెల్‌ఫోన్‌ స్నాచర్లకు సూడాన్‌ మాయగాళ్లతో ఉన్న లింకులను బట్టబయలు చేశారు. ఫోన్లను కొట్టేసి పకడ్బందీగా విదేశాలకు తరలించే కేటుగాళ్ల తీరు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. హత్య కేసులో వెలుగుచూసిన కొత్త అంశాలిలా ఉన్నాయి.

మూడు అంచెల్లో లావాదేవీలు.. నగరానికి చెందిన మహ్మద్‌ అమ్జాద్‌(35), సయద్‌ ఘయాజ్‌ హష్మి(35), షేక్‌ అన్సర్‌(27), మహ్మద్‌ ముజఫర్‌(35), మహ్మద్‌ ఖాలెద్‌(25), మహ్మద్‌ దస్తగిరి(28), మహ్మద్‌ హమేద్‌(18) మహ్మద్‌ మహమూద్‌ అలీ(30), సోహెల్‌ ఖాన్‌(22), మహ్మద్‌ ఖాన్‌(24), షేక్‌ మున్వర్‌(22), సయ్యద్‌ సాజిద్‌(44) సయ్యద్‌ షరీఫ్‌(48), మహ్మద్‌ ముస్తాక్‌(42), సయ్యద్‌ సలాయుద్దీన్‌(36) వేర్వేరు వృత్తుల్లో ఉన్నారు. సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లను ప్రవృత్తిగా మలచుకున్నారు. రద్దీ ప్రాంతాల్లోఅదను చూసి సెల్‌ఫోన్లు లాక్కొని పారిపోతారు. బాధితులు ఫిర్యాదు చేసే లోగానే ఫోన్లను నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో మొబైల్‌ఫోన్‌ దుకాణాలు నిర్వహిస్తున్న రిసీవర్లు షేక్‌ షాబాజ్‌ఖాన్‌(26), మహ్మద్‌ ఆసిఫ్‌ అహ్మద్‌(28), మహ్మద్‌ గౌస్‌(28), మహ్మద్‌ అర్ష మొహియుద్దీన్‌(45), మహ్మద్‌ నవీద్‌ ఉద్దీన్‌ సలీమ్‌(42), మహ్మద్‌ నజారుద్దీన్‌(50), మహవీర్‌జైన్‌(44), మహ్మద్‌ అబ్దుల్‌ సిరాజ్‌(36) మజీద్‌ఖాన్‌(30), అబ్దుల్‌ హజీమ్‌(34), షేక్‌ జావెద్‌ అలి(30)లకు అందజేస్తారు. మొబైల్‌ టెక్నీషియన్‌లు సయ్యద్‌ రహీమ్‌(28), మహ్మద్‌ అర్బాజ్‌ ఖాన్‌(25), నిజాముద్దీన్‌(29), ఖాన్‌ సాదిక్‌ అహ్మద్‌(33) ఈ ఫోన్లను అన్‌లాక్‌ చేయటం, ఐఎంఈఐ నంబర్లను ట్యాంపరింగ్‌ చేస్తారు. కొత్త వాటిగా తయారు చేసిన ఈ ఫోన్లను కంపెనీల ఆధారంగా వేరు చేస్తారు. ఒక్కో ఫోన్‌ రూ.10,000-15,000 వరకు సూడాన్‌కు చెందిన ఫోన్‌ యాక్సరీస్‌ వ్యాపారి మహ్మద్‌ మూసా హస్సన్‌ గమరలంబియా(26) కొనుగోలు చేసి దేశ సరిహద్దులు దాటిస్తున్నాడు. వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు ఈ లింకులు బయటపడ్డాయి. నిందితులను రిమాండ్‌కు తరలించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని