logo

RK Math: విద్య ఉన్నచోటే లక్ష్మీ, శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయి: స్వామి బోధమయానంద

స్వామి బోధమయానంద దివ్యాశీస్సులతో శ్రీరామకృష్ణమఠంలో 15రోజుల సంస్కార్ వేసవి శిక్షణా కార్యక్రమం ముగిసింది.

Published : 27 May 2024 15:59 IST

హైదరాబాద్‌: స్వామి బోధమయానంద దివ్యాశీస్సులతో శ్రీరామకృష్ణమఠంలో 15రోజుల సంస్కార్ వేసవి శిక్షణా కార్యక్రమం ముగిసింది. హైదరాబాద్ నగరంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 1200కు పైగా విద్యార్థులు పక్షం రోజులపాటు జరిగిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో భగవద్గీత, శ్లోకాలు, యోగా, సంస్కృతం, శాస్త్రీయ నాట్యం, నాటికలతో పాటు నైతికవిలువలు, సామాజిక బాధ్యత వంటి పలు అంశాలపై శిక్షణ పొందారు. పాఠశాల, కళాశాలలతో పాటు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా చక్కని వినయ విధేయతలతో   ఆశ్రమంలో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

సంస్కార్ వేసవి శిక్షణా కార్యక్రమం ముగింపు సభకు తెలంగాణ హైకోర్టు జస్టిస్ భీమపాక నగేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కోట్లాది ప్రజలను తన మాటలనే తూటాలతో జాగృతం చేసిన స్వామి వివేకానంద స్ఫూర్తి అందుకున్న చిన్నారులు ఆదర్శవంతులుగా ఎదుగుతారని ఆయన అన్నారు. పిల్లల మనసుల్ని కష్టపెట్టకుండా వారికి సరైన సమయంలో సరైన విధంగా పెద్దలు నడిపించాలని అన్నారు. పిల్లలకు కష్టం విలువ తెలియజేయాలని అప్పుడే వారు జీవితంలో పోరాట పటిమ అలవర్చుకుంటారని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

శ్రీరామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద  తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడుతూ.. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న సందేశాన్ని ఈ తరానికి నేర్పించాలని తెలిపారు. ఎక్కడైతే స్వచ్ఛత, నిస్వార్థగుణాలు ఉంటాయో అక్కడే  ప్రపంచం తలవంచుతుందని అన్నారు. విద్య ఉన్నచోటే లక్ష్మీ, అక్కడే శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయని అన్నారు. సమాజానికి సేవద్వారా కృతజ్ఞత చాటుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం సందర్శకులుగా కాకుండా మిషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రావాలని భక్తులకు పిలుపునిచ్చారు. అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ
భారతదేశం ప్రపంచానికి దారి చూపుతోందని అన్నారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన తెలుగు నాటకం, సంస్కృత నాటకం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు