logo

కంబోడియాలో తెలంగాణ యువతపై ఆరా

మంచి సంపాదన, చేతినిండా సొమ్ము, కుటుంబాన్ని చక్కగా సాకేందుకు అనువైన మార్గం.. ఇలాంటి మాయమాటలతో  ఎంతోమంది యువకులను మాయగాళ్లు విదేశాలకు చేరవేస్తున్నారు.

Published : 28 May 2024 02:30 IST

ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు సైబర్‌క్రైమ్‌ పోలీసుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: మంచి సంపాదన, చేతినిండా సొమ్ము, కుటుంబాన్ని చక్కగా సాకేందుకు అనువైన మార్గం.. ఇలాంటి మాయమాటలతో  ఎంతోమంది యువకులను మాయగాళ్లు విదేశాలకు చేరవేస్తున్నారు. ఉపాది అవకాశాల కోసం అక్కడకు వెళ్లిన వీరిని డ్రగ్స్‌ స్మగ్లింగ్, సైబర్‌ నేరాలకు పావులుగా వాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులను పోలీసులు చెర విడిపించి స్వస్థలాలకు చేర్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో తెలంగాణ నుంచి కంబోడియా చేరిన యువత గురించి నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు ఆ దేశానికి వెళ్లిన యువత వివరాలు ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం. దీని ఆధారంగా సంబంధిత పోలీస్‌స్టేషన్లకు వివరాలు పంపి ఆ యువకుల కుటుంబ వివరాలు, క్షేమ సమాచారాలు, వారిని అక్కడకు పంపిన దళారులు ఎవరనే గుట్టు తెలుసుకునేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. 
కొలువులంటూ ఏమార్చి.. ఉద్యోగ వేటలో ఉన్న యువకులే లక్ష్యంగా మోసాల వల విసురుతారు. దీనికోసం దళారులను రంగంలోకి దింపుతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతను గుర్తించి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మాట కలుపుతారు. సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్‌ తదితర దేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరి ఏడాదిలో ఆర్థిక ఇబ్బందులు దూరం చేసుకోవచ్చని ఆశ చూపుతారు. ఇదంతా నిజమని భావించిన యువకులు అడిగినంత డబ్బులిస్తున్నారు. ఉచ్చులో చిక్కిన యువతను దళారులు దుబాయ్‌ మీదుగా కంబోడియా అక్రమంగా రవాణా చేస్తున్నారు. చైనా మాయగాళ్ల చేతికి అప్పగిస్తున్నారు. వీరి పాస్‌పోర్టు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఆ ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సైబర్‌ నేరాలకు పావులుగా వాడుకుంటున్నట్టు ఇటీవల పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఫెడెక్స్‌ కొరియర్‌లో మాదకద్రవ్యాలు, సిమ్‌కార్డులతో అసాంఘిక కార్యకలాపాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలకు ఉపయోగించుకుంటున్నారు. కంబోడియా కేంద్రంగా ఇవన్నీ సాగుతున్నట్టు గుర్తించారు.


ఇప్పుడేం చేస్తారంటే.. ఏటా రాష్ట్రం నుంచి ఉద్యోగం, ఉన్నత విద్యావకాశాలకు లక్షలాది మంది విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో ఆఫ్రికా దేశాలకు వెళ్తున్న వారిని అక్కడి డ్రగ్స్‌ ముఠాలు కమీషన్‌ ఆశచూపి ఏజెంట్లుగా మలచుకుంటున్నాయి. గతేడాది డ్రగ్స్‌ కేసులో బెంగళూరు పోలీసులు ఒక మహిళను అరెస్ట్‌ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన ఒక ముఠా ఉద్యోగం పేరుతో రప్పించి మత్తు పదార్థాలు చేరవేసే ఏజెంట్‌గా మార్చినట్టు నిర్ధారించారు. తాజాగా కంబోడియాలో చైనీయులు తెలుగు యువతను సైబర్‌ నేరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. లభించిన సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని