logo

వాహన ప్రయాణాలా..జరభద్రం

కార్యాలయం నుంచి త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరపాటు, నిమిషం ఆలస్యమైతే అందుకోవాల్సిన రైలు, విమానం వెళ్లిపోతుందనే ఆందోళన వెరసి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నగరవాసులు బయటకి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

Published : 28 May 2024 03:02 IST

వర్షాలతో పొంచి ఉన్న ప్రమాదం

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: కార్యాలయం నుంచి త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరపాటు, నిమిషం ఆలస్యమైతే అందుకోవాల్సిన రైలు, విమానం వెళ్లిపోతుందనే ఆందోళన వెరసి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నగరవాసులు బయటకి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. స్వీయ తప్పిదాలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల వర్షా కాలంలో ఏటా పదుల సంఖ్యలో నగర వాసులు జల సమాధి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

  • యాదాద్రి జిల్లా బొమ్మలరామారానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి, ధర్మారం వాసి  ధనుంజయ్‌తో కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై శామీర్‌పేట మండలం తూకుంటలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈదురు గాలులకు వీరిపై చెట్టు కొమ్మ విరిగి పడటంతో మృతి చెందిన ఘటన విదితమే.

ఆలస్యమైనా ఆగి వెళ్లడం ఉత్తమం

ఎక్కువగా వర్షాలు సాయంత్రం పడుతున్నాయి. అదే సమయంలో పాఠశాలల నుంచి చిన్నారులు, కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. చిన్న చినుకులే అని భావించి నిమిషం ఆలస్యం చేయకుండా ఇంటి బాట పడతారు. అంతలోనే వర్షం పెద్దదిగా మారడం.. వరద రోడ్లపై పొంగిపొర్లడం క్షణాల్లో జరుగుతోంది. వరద ఉద్ధృతికి రహదారులపై ఉండే మ్యాన్‌హోళ్లు, గుంతలు, ఫుట్‌పాత్‌లు గమనించలేని పరిస్థితి నెలకొంటోంది. వరదలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నగరవాసులు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు.  

ప్రజా రవాణా శ్రేయస్కరం

నిత్యం రాకపోకలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణించేందుకు నగరంలో అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంది. వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు తమ సొంత వాహనాలపై వెళ్లకుండా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని