logo

దీపం వెలిగించే దిక్కేది?

రాజధానిలో వీధిలైట్లు వెలగట్లేదు. కాలనీల్లోనే కాదు.. ప్రధాన రహదారులపైనా ఇదే దుస్థితి. హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్‌లోని ఇతర జనావాసాలనూ సమస్య వేధిస్తోంది. పాడైపోయిన లైట్లకు మరమ్మతు జరగట్లేదు.

Updated : 28 May 2024 03:50 IST

పాతవి వెలగవు.. కొత్తవి బిగించరు
వీధిదీపాలపై రోజూ  వెయ్యి ఫిర్యాదులు
నిధులు, నిర్వహణ సమస్యలతో జనాలకు అవస్థ

రాయదుర్గం- జూబ్లీహిల్స్‌ లింక్‌ రోడ్డులో వెలగని వీధిదీపాలు 

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో వీధిలైట్లు వెలగట్లేదు. కాలనీల్లోనే కాదు.. ప్రధాన రహదారులపైనా ఇదే దుస్థితి. హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్‌లోని ఇతర జనావాసాలనూ సమస్య వేధిస్తోంది. పాడైపోయిన లైట్లకు మరమ్మతు జరగట్లేదు. కొత్త ప్రాంతాల్లో, ప్రమాదాలు జరిగే చీకటి ప్రాంతాల్లో కొత్త వీధిలైట్ల ఏర్పాటు అందని ద్రాక్షగా మారింది. జీహెచ్‌ఎంసీతోపాటు, గ్రేటర్‌ పరిధిలో వీధి లైట్ల నిర్వహణ బాధ్యత చూస్తోన్న ఈఈఎస్‌ఎల్‌(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) కూడా నిధుల సమస్యలో కూరుకుపోవడం, నిర్వహణపై ఈఈఎస్‌ఎల్, బల్దియా ఇంజినీర్లు చేతులెత్తేయడంతో వీధులు చీకటిమయం అవుతువున్నాయి. దీనివల్ల బస్తీవాసులు నరకం చూస్తున్నారు. పాదచారులు రహదారులపై నడవలేకపోతున్నారు. ముందు నడుస్తూ వెళ్లే వారిని వాహనదారులు గమనించలేకపోతున్నారు. దుర్భర పరిస్థితులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. 

హెచ్చరించినా మారని తీరు..

జీహెచ్‌ఎంసీ పరిధిలోని వీధిలైట్ల నిర్వహణ ఈఈఎస్‌ఎల్‌ సంస్థ ఆరేళ్ల కిందట దక్కించుకుంది.  ఆయా స్థానిక సంస్థలు, పంచాయతీల నుంచి సవ్యంగా బిల్లులు మంజూరవట్లేదంటూ.. రెండేళ్లుగా ఈఈఎస్‌ఎల్‌ జీహెచ్‌ఎంసీకి చెబుతోంది. నగరంలో వీధి లైట్ల నిర్వహణలోని లోపాలపై ప్రశ్నించినప్పుడల్లా.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని వాపోతోంది. ‘‘ప్రతి నెలా జీహెచ్‌ఎంసీ తరఫున మేము బిల్లులను చెల్లిస్తున్నాం. ఎవరో నిధులు ఇవ్వట్లేదని హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే బిల్లులను ఆపేస్తాం.’’అని జీహెచ్‌ఎంసీ గతంలోనే హెచ్చరించింది. 

బల్బుల కొరతతో..  

నగరంలో దాదాపు 5.4 లక్షల వీధిలైట్లు ఉన్నాయి. వాటిలో 98శాతం లైట్లు రోజూ వెలగాలి. అప్పుడే ఆ నెల బిల్లును చెల్లిస్తామని జీహెచ్‌ఎంసీ ఒప్పందం చేసుకుంది. రెండేళ్లుగా.. ఆ ఒప్పందాన్ని ఈఈఎస్‌ఎల్‌ చేరుకోవట్లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. దాంతో ఆరు నెలలుగా బిల్లులను ఆపేశామన్నారు. ఈ ఏడాది 10వేల కొత్త లైట్లను అందుబాటులో ఉంచాలని చెబితే.. ఇప్పటి వరకు ఒక్క లైటును కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. 18, 30, 38 వాట్ల బల్పుల కొరత ఉందని చెబుతున్నారు. 

ఇవిగో ఉదాహరణలు..

హైటెక్‌సిటీలోని మెటల్‌ చార్మినార్‌ నుంచి శిల్పారామం వరకు, నాసర్‌ బాలుర పాఠశాల నుంచి శిల్పాలేఅవుట్‌వరకు, జూబ్లిహిల్స్‌ రోడ్డు నెం.45 పైవంతెనపై, మాదాపూర్‌లోని టెలికాంనగర్, అంజయ్యనగర్, బోరబండ ఫేజ్‌-3, కేపీహెచ్‌బీ కాలనీ రోడ్లలో చీకట్లు అలముకున్నాయి.


నగరంలోని పలు ప్రధాన ఆస్పత్రుల వద్ద కూడా వీధిలైట్లు పనిచేయట్లేదు. గాంధీ ఆస్పత్రి వద్ద సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌ లైట్లను ఉపయోగించి రోగులు, రోగి బంధువులు రోడ్డు దాటుతున్నారు. అక్కడ తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌ వాకర్‌టౌన్‌ కాలనీలోని వీధిలైట్లన్నీ చెట్ల కొమ్మల్లో చిక్కుకున్నాయి. వారాసిగూడ జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ వీధిలో చీకట్లు కమ్ముకున్నాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌ రోడ్డు, మారేడుపల్లి జడ్జీల క్వార్టర్స్‌లోనూ అదే పరిస్థితి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని