logo

CNG: హైదరాబాద్‌లో సీఎన్జీ కోసం బంకు ముందు బారులు

సీఎన్జీ  కోసం వాహనదారులు పడిగాపులు పడుతున్నారు. బంకుకు వెళ్లినప్పుడల్లా వాహనాలు బారులు తీరుతుండటంతో ప్రతిసారీ రెండు నుంచి మూడు గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. కాలుష్య నియంత్రణ, మైలేజీ, పెట్రోల్‌తో పోల్చితే ధర కాస్త తక్కువ అని వాహనాలు కొనుగోలు చేస్తుంటే ఇంధనం కోసం పాట్లు తప్పడం లేదు.

Updated : 29 May 2024 08:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: సీఎన్జీ  కోసం వాహనదారులు పడిగాపులు పడుతున్నారు. బంకుకు వెళ్లినప్పుడల్లా వాహనాలు బారులు తీరుతుండటంతో ప్రతిసారీ రెండు నుంచి మూడు గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. కాలుష్య నియంత్రణ, మైలేజీ, పెట్రోల్‌తో పోల్చితే ధర కాస్త తక్కువ అని వాహనాలు కొనుగోలు చేస్తుంటే ఇంధనం కోసం పాట్లు తప్పడం లేదు. ఓ వైపు వాహనాల సంఖ్య పెరుగుతుంటే అందుకు తగినన్ని బంకులు ఉన్నా ఇంధన సరఫరా అరకొరగా ఉంటోంది. నగరంలో మొత్తం 50కి పైగా బంకులుండగా ఒక్కో దానిలో ప్రతిరోజూ 2వేల కేజీల సీఎన్జీ విక్రయిస్తున్నారు. సీఎన్జీ ఆటోలు, కార్ల విక్రయాలు ప్రతినెలా పెరుగుతున్నాయని ఆటోమొబైల్‌ మార్కెటింగ్‌ ప్రతినిధులు చెబుతుండగా అందుకు తగినట్లు ఇంధన సరఫరా పెరగడం లేదు. నగరంలో 58వేలకు పైగా సీఎన్జీ ఆటోలు, 140 బస్సులు, జీహెచ్‌ఎంసీలో రవాణా వాహనాలు, 4వేల కార్లు ఉన్నాయి. వీటికి సరిపడా ఇంధనం సరఫరాలో భాగ్యనగర్‌ గ్యాస్‌ కంపెనీ లిమిటెడ్‌ వెనకపడుతోందని వాహనదారులు చెబుతున్నారు. నగరంలో పూర్తిస్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. శామీర్‌పేట్‌లో మదర్‌స్టేషన్‌ ఏర్పాటు చేసి సీఎన్జీ అందుబాటులోకి తెచ్చినా...గ్రిడ్‌ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేకపోతున్నారు. 20 రోజులుగా ఇదే సమస్య కొనసాగుతోంది. కారణం అడిగితే శామీర్‌పేట్‌ మదర్‌స్టేషన్‌లో ఏదో సమస్య ఉందని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. రోజూ కనీసం అరగంట బంకు వద్దే వేచి ఉండాల్సి వస్తోందని ఒక్కోసారి 90 నిముషాలు పడుతోందని దీంతో ఆదాయం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలో ఉండలేక ఒక్కో రోజు నాలుగైదు బంకులు తిరగాల్సి వస్తోందని వాహనదారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని