logo

Cell Phone: ఫోన్ పోయిందా సూడాన్‌లో గాలిద్దాం!.. మూడేళ్లలో లక్షన్నర మొబైల్స్ మాయం

అంబర్‌పేట కూడలిలో బైక్‌పై వెళ్తున్న యువకుడు కిందపడిపోతున్నట్టు నటించాడు. ఓ వ్యక్తి కాపాడేందుకు వెళ్లాడు. పక్కనున్న మరో యువకుడు ఆ వ్యక్తి జేబు నుంచి సెల్‌ఫోన్‌ కొట్టేశాడు. 30-40 సెకన్ల వ్యవధిలో ఆ ఇద్దరూ బైక్‌పై మాయమయ్యారు.

Updated : 30 May 2024 07:50 IST

 నగరంలో 30కి పైగా చోరీ ముఠాల హల్‌చల్‌

 

  •  అంబర్‌పేట కూడలిలో బైక్‌పై వెళ్తున్న యువకుడు కిందపడిపోతున్నట్టు నటించాడు. ఓ వ్యక్తి కాపాడేందుకు వెళ్లాడు. పక్కనున్న మరో యువకుడు ఆ వ్యక్తి జేబు నుంచి సెల్‌ఫోన్‌ కొట్టేశాడు. 30-40 సెకన్ల వ్యవధిలో ఆ ఇద్దరూ బైక్‌పై మాయమయ్యారు.  పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలైనా ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
  • మెహిదీపట్నంలో ఆటో ఎక్కిన ఐటీ నిపుణుడు షేక్‌పేట్‌ నాలా వద్ద దిగిపోయాడు. కొంతదూరం నడచుకుంటూ వెళ్లాక జేబులో సెల్‌ కనిపించకపోవటంతో కంగారుపడ్డాడు. ఆటోలో ఇరువైపుల కూర్చున్న యువకులు కొట్టేసి ఉండొచ్చని ఫిర్యాదు చేశాడు. 
  • ఎంజీబీఎస్‌ వద్ద మహబూబ్‌నగర్‌ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న యువకుడి ఫోన్‌ను కొందరు అతి లాఘవంగా కాజేసి మాయమయ్యారు.

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో రోజూ సగటున 100కు పైగా మొబైల్‌ఫోన్లు మాయమవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో ఐఎంఈఐ నంబర్లు మార్చి దర్జాగా దేశం దాటిస్తున్నారు. దీంతో పోలీసులు గుర్తించలేకపోతున్నారు. నగరంలో ఫోన్లలో 70శాతం చోరీకి గురవుతుంటే.. 30శాతం పనిచేసే ప్రదేశాలు, ప్రయాణాల్లో నిర్లక్ష్యం, ఏమరపాటుతో పారేసుకుంటున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. మరికొందరు తక్కువ ధరకు కొనుగోలు చేసిన సెల్‌ఫోన్లు మాయమైనట్టు గుర్తించినా తేలికగా తీసుకుంటున్నారు. కీలక సమాచారం, వ్యక్తిగత వివరాలు, ఖరీదైనవి పోగొట్టుకున్నప్పుడు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మాయమైన ఫోన్లను కొందరు సిమ్‌కార్డులు మార్చి వాడుకుంటుంటే.. దొంగలు వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిన్నటి వరకూ సెల్‌ఫోన్ల స్నాచింగ్స్‌ మద్యం, గంజాయి, రోజువారీ అవసరాల కోసం పాల్పడుతున్నట్టు భావించారు. తాజా ఘటనలతో ఇదంతా వ్యవస్థీకృత నేరాలనే అంచనాకు వచ్చారు. గృహదొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లతో దొరికిపోతామనే భయంతో స్నాచర్లు, జేబుదొంగలు, పాత నేరస్థులు రూటు మార్చారు.

రద్దీ ప్రాంతాల్లో నక్కి.. నొక్కేస్తారు

దేశ, విదేశాల్లో సెకండ్‌హ్యాండ్‌ మొబైల్‌ ఫోన్ల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు స్థానిక దొంగలతో అంతర్జాతీయ ముఠాలు జతకడుతున్నాయి. నైజీరియా, సూడాన్, ఇరాన్‌ తదితర దేశాల నుంచి విద్య, వ్యాపారం, పర్యాటక వీసాలతో హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి చేరిన విదేశీయులు ఇక్కడి దొంగలతో స్నేహం చేస్తున్నారు.  మైనర్లు, జేబుదొంగలతో ముఠాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, రద్దీ ప్రాంతాలను చోరీలకు వేదికగా మార్చుకున్నారు. కొన్ని ముఠాలు రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లే వారిని అటకాయించి ఆయుధాలతో బెదిరించి సెల్‌ఫోన్లు కాజేస్తున్నారు. ఇటీవల అరెస్టయిన సూడాన్‌ దేశస్థుడు ప్రతి నెలా రెండుసార్లు హైదరాబాద్‌ వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రతి 15 రోజులకోసారి నగరానికి చేరి 1500 సెల్‌ఫోన్లు సేకరించి సముద్రమార్గంలో తమ దేశానికి చేరవేసినట్టు నిర్ధారించారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని