logo

Honey Trap: అతడే ఆమెలా.. వర్చువల్‌ వలపు వల

ఓ యువకుడు సామాజిక మాధ్యమంలో అమ్మాయి పేరిట యూజర్‌ ఐడీ సృష్టించాడు. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి పరిచయాలు పెంచుకుని బాధితులను ఛాటింగ్‌లో దించుతాడు.

Updated : 25 May 2024 11:37 IST

కట్టుకథలు చెప్పి రూ.14 లక్షలు కాజేత
నిందితుడి అరెస్టు

అశోక్‌రెడ్డి

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఓ యువకుడు సామాజిక మాధ్యమంలో అమ్మాయి పేరిట యూజర్‌ ఐడీ సృష్టించాడు. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి పరిచయాలు పెంచుకుని బాధితులను ఛాటింగ్‌లో దించుతాడు. పెళ్లంటూ నమ్మించి వర్చువల్‌ వలపు వల వేశాడు. తక్షణ అవసరాల ముసుగులో రూ.14లక్షలు కాజేశాడు. చివరికి పైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. సైబర్‌ క్రైం ఏసీపీ బి.రవీందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన మారం అశోక్‌రెడ్డి(23) సైబర్‌ మోసాల ద్వారా వలవేసి డబ్బులు దండుకోవాలకున్నాడు. స్నాప్‌ ఛాట్‌లో ప్రణీతరెడ్డి పేరిట నకిలీ యూజర్‌ ఐడీ సృష్టించాడు. అందమైన యువతి ప్రొఫైల్‌ ఫొటో పెట్టి పలువురికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. రిక్వెస్ట్‌ను అంగీకరించిన వారితో వర్చువల్‌ ఛాటింగ్‌ చేసేవాడు. తర్వాత ప్రేమ, పెళ్లి పేరిట వారికి గాలమేసేవాడు. బాధితులను నమ్మించేందుకు ఫొటోలు పంపాడు. ఛాటింగ్‌లో తన మాటలతో నమ్మకం కుదిరాక తాను వ్యాపారం చేస్తున్నానని ఇందుకు ఆర్థిక సాయం చేయాలని కొందరికి, తాను పలు రకాలుగా మోసపోయానని హృదయం కదిలించే విధంగా మరికొంత మందికి కట్టుకథలు చెప్పేవాడు. నమ్మిన బాధితులు అడిగినంత ఇచ్చేవారు. అలా రూ.14 లక్షలు వసూలు చేశాడు. డబ్బును గేమింగ్‌ యాప్‌లలో ఖర్చు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్న ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్, కానిస్టేబుల్స్‌ రాజేశ్, అనూష, సీహెచ్‌ రాజేశ్‌ ఖన్నా, రాజ్‌కుమార్, అరుణ, టి.అజయ్‌కుమార్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు