logo

లిఫ్ట్‌ ఇస్తామంటూ.. దోపిడీలు!

ఒంటరి ప్రయాణికులను లిఫ్ట్‌ పేరుతో కారులో ఎక్కించుకుని దోపిడీకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 07 Dec 2022 03:37 IST

నలుగురు నిందితుల అరెస్టు

రెండు కార్లు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఉత్తర మండలం డీసీపీ చందనాదీప్తి, అదనపు డీసీపీ యోగేష్‌ గౌతమ్‌, ఏసీపీ సుధీర్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే:  ఒంటరి ప్రయాణికులను లిఫ్ట్‌ పేరుతో కారులో ఎక్కించుకుని దోపిడీకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రెండు కార్లు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ యోగేష్‌ గౌతమ్‌, గోపాలపురం ఏసీపీ సుధీర్‌, ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌, డీఐ కోటయ్యలతో కలసి డీసీపీ చందనాదీప్తి వివరాలు వెల్లడించారు.

సైదాబాద్‌ సింగరేణికాలనీకి చెందిన ఫసీ అహ్మద్‌ పెయింటర్‌.  ఇతనికి నగరానికి చెందిన వంట మేస్త్రి మహ్మద్‌ ఖలీద్‌(25), లారీ డ్రైవర్‌ మహమ్మద్‌ మహబూబ్‌ పాషా(32), ప్రైవేట్‌ ఉద్యోగి మహమ్మద్‌ అబ్దుల్‌ హసన్‌(32), ఆటోడ్రైవర్‌ మహమ్మద్‌ ఖాన్‌ (35)లతో స్నేహమేర్పడింది.  మహ్మద్‌ మహబూబ్‌ పాషా యజమానుల నుంచి కారు కిరాయి తీసుకునేవాడు.నంబరు కనిపించకుండా స్టిక్కర్లు వేసేవారు. మహ్మద్‌ పథకం వేస్తే మిగిలిన నలుగురు అర్ధరాత్రి, తెల్లవారుజాము వేళల్లో కారులో చక్కర్లు కొడుతూ ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్లు, రహదారి పక్కన ఒంటరి ప్రయాణికులను ఎంపిక చేసుకునేవారు. వారితో మాట కలిపి  లిప్టు పేరిట కారులో ఎక్కించుకునేవారు. కొంతదూరం వెళ్లాక కత్తితో బెదిరించి నగదు, సెల్‌ఫోన్లను లాక్కొని కారు నుంచి బయటకు నెట్టేసేవారు. కొట్టేసిన సెల్‌ఫోన్లను నగరంలోని ముఠాలకు అమ్మేవారు. సెప్టెంబర్‌ 23న తెల్లవారుజామున లాలాపేట్‌ లక్ష్మీనగర్‌కు చెందిన షేక్‌ అఫ్సర్‌ జానీ  మాదాపూర్‌ నుంచి ఇంటికి వస్తుండగా..అక్కడున్న నిందితులు అతన్ని కారులో ఎక్కించుకున్నారు. రైలు నిలయం వద్దకు చేరగానే కత్తితో బెదిరించి రూ.10,200, సెల్‌ఫోన్‌ లాక్కొని బయటకు నెట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అదేరోజు మరోచోట ఇదే తరహా ఫిర్యాదు వచ్చింది.  

* మంగళవారం తెల్లవారుజామున చిలకలగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేపడుతుండగా కారులో నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో దోపిడీ ముఠాగుట్టు వెలుగుచూసింది. ప్రధాన నిందితుడు ఫసి అహ్మద్‌ పరారీలో ఉన్నాడు. దొంగల ముఠాకు కార్లు అద్దెకిచ్చిన యజమానుల నుంచి వివరాలు రాబట్టారు. రాత్రిళ్లు కారును కిరాయికిస్తే సొమ్ము వస్తుందనే ఆశతోనే చేశామంటూ వాపోయినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని