logo

తగ్గిన ప్రవాహం.. ‘దందా’ పర్వం!

కాగ్నా నది వద్ద ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పరీవాహక ప్రాంతాలైన పెద్దేముల్‌, తాండూరు, యాలాల, బషీరాబాద్‌ మండలాల్లోని గ్రామాల్లో వ్యాపారులు దందాకు తెరలేపారు.

Published : 04 Feb 2023 03:17 IST

జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు

నదిలో దారి ఏర్పాటుకు సన్నాహాలు 

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: కాగ్నా నది వద్ద ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పరీవాహక ప్రాంతాలైన పెద్దేముల్‌, తాండూరు, యాలాల, బషీరాబాద్‌ మండలాల్లోని గ్రామాల్లో వ్యాపారులు దందాకు తెరలేపారు. నీటి ప్రవాహం తగ్గడంతో తోడేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలోని వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

పగలు నిల్వ.. రాత్రి తరలింపు

ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. వీటికి ఇసుక చాలా అవసరం. ఇదే అదునుగా వ్యాపారులు డిమాండ్‌ను బట్టి రేట్లను నిర్ణయిస్తున్నారు. దూరం ఎక్కువగా ఉంటే ట్రాక్టర్‌ ఇసుకకు రూ.8 వేలు తీసుకుంటున్నారు. స్థానికంగా రూ.6 వేలకు తక్కువ తీసుకోవడం లేదు. వారం రోజులుగా నదిలో ఇసుకను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. పగలంతా తోడేసి రాత్రి కాగానే ట్రాక్టర్లు, లారీల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అర్ధరాత్రి పల్లెల్లో అలజడి

ఇసుక వ్యాపారులు నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను మొదలు పెట్టడంతో పల్లెల్లో అర్ధరాత్రి నుంచి అలజడి మొదలవుతోంది. లారీలు, ట్రాక్టర్ల మోతతో జనాలు నిద్రపోయే పరిస్థితి లేకుండాపోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దేముల్‌ మండలం మన్‌సాన్‌పల్లి, రేగొండి, కొండాపూరు, రుక్మాపూరు, మదనంతాపూరు, తాండూరు మండలం ఖాంజపూరు, బిజ్జారం, యాలాల మండలం కోకట్‌, విశ్వనాథ్‌పూర్‌, బషీరాబాద్‌ మండలం నవల్గా, క్యాదీర్గ గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. రాత్రి సమయంలో అధికారుల తనిఖీ లేకపోవడంతో అడిగేవారు లేరని దర్జాగా కొనసాగిస్తున్నారు.
ప్రత్యేక దారులు: వాగుల నుంచి తవ్వేసిన ఇసుకను రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసుకున్నారు. మన్‌సాన్‌పల్లి, మదనంతాపూరు నుంచి మారేపల్లి తండా మీదుగా పెద్దేముల్‌లోని ప్రధాన రహదారికి చేరుకుంటున్నారు. కందనెల్లి నుంచి తండా మీదుగా, ఖానాపూరు నుంచి గాజీపూరు మీదుగా జహీరాబాద్‌ వైపు ఇసుకను సరఫరా చేస్తున్నారు.


తనిఖీచేసి అడ్డుకట్ట వేస్తాం

విద్యాసాగర్‌రెడ్డి, తహసీల్దారు, పెద్దేముల్‌

ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాగ్నా పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో వీఆర్‌ఏలతో బందోబస్తు చేపడతాం. పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని