logo

Hyderabad Traffic: హైదరాబాద్‌లో మరో 10 రోజులు ట్రా‘ఫికర్‌’

అంబులెన్స్‌లు గగ్గోలు పెడుతున్నాయి. వాహనదారులు అల్లాడిపోతున్నారు. రోడ్డు దాటేందుకు పాదచారులు వణకిపోతున్నారు. గమ్యం చేరేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

Updated : 09 Feb 2023 07:58 IST

తెలుగుతల్లి పైవంతెన సమీపంలో ఆగిన వాహనాలు

ఈనాడు, హైదరాబాద్‌: అంబులెన్స్‌లు గగ్గోలు పెడుతున్నాయి. వాహనదారులు అల్లాడిపోతున్నారు. రోడ్డు దాటేందుకు పాదచారులు వణకిపోతున్నారు. గమ్యం చేరేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఎటుచూసినా ట్రాఫిక్‌ జామ్‌లే. మూడ్రోజులుగా ముప్పుతిప్పలు పడుతున్న నగర ప్రజలకు మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవనేలా పరిస్థితులు నెలకొన్నాయి. మంగళ, బుధవారాలు ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారులు, వీధులూ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఒకవైపు శాసనసభా సమావేశాలు, ఈనెల 11న ఫార్ములా-ఈ రేసింగ్‌, 15 వరకు నుమాయిష్‌, 17న నూతన సచివాలయం ప్రారంభం, 18న శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. మరో 10 రోజులపాటు వాహనదారులు నరకం చవిచూడక తప్పదు. ట్రాఫిక్‌ పోలీసులు 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నా పరిస్థితిని చక్కదిద్దటం సవాలుగా మారింది.

రోజుకు 17,000 చలానాలు

గ్రేటర్‌లో 80 లక్షలకుపైగా వాహనాలున్నాయి. వీటిలో 30-40 లక్షలు రాకపోకలు సాగిస్తుంటాయని అంచనా. ఉదయం, సాయంత్రం రద్దీ కారణంగా 10-12 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 30-40 నిమిషాలు వెచ్చించాల్సి వస్తోంది. కొద్దిరోజులుగా కిలోమీటరు దూరానికే 50-60 నిమిషాలు పడుతోందంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాసబ్‌ట్యాంక్‌-ఖైరతాబాద్‌కు 45 నిమిషాలు సమయం పట్టిందంటూ ద్విచక్రవాహనదారుడు రమేశ్‌ వాపోయారు. ట్రాఫిక్‌ సమస్య మరింత పెరిగేందుకు నిబంధనల ఉల్లంఘనులే ప్రధాన కారణమంటున్నారు పోలీసులు. నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపై ప్రతిరోజూ సుమారు 17,000 చలానాలు నమోదవుతుంటాయి. వీరిలో అధికశాతం నోపార్కింగ్‌, రాంగ్‌రూట్‌, ట్రిపుల్‌రైడింగ్‌, హెల్మెట్‌ ధరించకపోవటం, అధిక వేగం, మైనర్ల డ్రైవింగ్‌, డ్రంకన్‌ డ్రైవింగ్‌, నంబరు ప్లేటు, లైసెన్స్‌ లేనివారే ఉంటున్నారు. ప్రధాన మార్గాల్లో ఇష్టానుసారం చేరుతున్న తోపుడుబండ్లు, దుకాణాల వద్ద వాహనాలు నిలపటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమయ్యారు. గురు, శుక్రవారాలు తనిఖీలు చేపట్టి ఉల్లంఘనులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం.


21,000 మంది ప్రేక్షకులు

11న ఫార్ములా-ఈ రేసింగ్‌ అంతర్జాతీయస్థాయిలో జరిగే పోటీలకు 21,000 మందికిపైగా వస్తారని అంచనా. రేసింగ్‌ నిర్వహించే ఎన్టీఆర్‌మార్గ్‌, సచివాలయం, తెలుగుతల్లి పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. రేసింగ్‌ జరిగే రోజు సికింద్రాబాద్‌-ట్యాంక్‌బండ్‌ వైపు మార్గాల్లో వెళ్లేందుకు అనుమతించరు. వచ్చే శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు అదనంగా 500-600 మందిని రంగంలోకి దింపేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు