logo

అన్నదాత ఆశలు ఆవిరి!

అన్నదాతలను అకాల వర్షాలు కలవరపెడుతున్నాయి. వడగళ్లకు తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో మామిడి, బొప్పాయి లాంటి పంటలకు నష్టం వాటిల్లుతోంది.

Published : 19 Mar 2023 02:33 IST

సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పెరుగుతున్న పంట నష్టం
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, మర్పల్లి, రాయికోడ్‌, వికారాబాద్‌ గ్రామీణ

చిట్టిగిద్దలో దెబ్బతిన్న క్యాబేజీ  

న్నదాతలను అకాల వర్షాలు కలవరపెడుతున్నాయి. వడగళ్లకు తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో మామిడి, బొప్పాయి లాంటి పంటలకు నష్టం వాటిల్లుతోంది. సంగారెడ్డిలో వ్యవసాయ పంటలైన జొన్న, మొక్కజొన్న, శనగ పంటలకు భారీస్థాయిలో నష్టం వాటిల్లింది. వికారాబాద్‌లో వడగళ్ల తీవ్రతకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రెండు జిల్లాల్లోనూ జొన్న, మొక్కజొన్న రైతులు కోలుకోలేని పరిస్థితి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ పరిమాణంలో వడగళ్లు పడటంతో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలంలో అత్యధికంగా 7.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్ష తీవ్రతకు ఈ ఒక్క మండలంలో 325 ఎకరాల్లో జొన్న పంట దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రెండు జిల్లాల్లోనూ చాలా చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

1,633.24 ఎకరాల్లో..

సంగారెడ్డి జిల్లాలో రెండో రోజూ పంట నష్టం వివరాలను అధికారులు సేకరించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. తొలిరోజు 723 ఎకరాల మేర నష్టం వాటిల్లినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం అది 1,633.24ఎకరాలకు చేరింది. ఉద్యాన పంటల విషయంలో మార్పులేదు. జొన్న, మొక్కజొన్న, శనగ పంటలకు సంబంధించిన విస్తీర్ణం పెరిగింది. మొత్తం 62 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

ఎర్రవల్లిలో భారీ వడగళ్లు


రైతుల వారీగా సమాచార సేకరణ

వికారాబాద్‌ జిల్లాలో గురువారం కురిసిన వడగళ్లతో పాటు వికారాబాద్‌, తాండూరు, కోట్‌పల్లి, మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో శుక్ర, శనివారాలు  కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనా పూర్తి చేశారు. ఉద్యాన శాఖ జిల్లా అధికారి చక్రపాణితో మాట్లాడగా.. వడగళ్ల ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతువారీగా పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? ప్రస్తుతం ఎంత నష్టం వాటిల్లింది? అనే వివరాలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు  జరిగిన నష్టానికి సంబంధించి ఆదివారం ఉదయం వరకు నివేదిక సిద్ధం చేయనున్నామని ఆయన వెల్లడించారు. ప్రాథమిక అంచనా కంటే నష్టతీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని