logo

ఆన్‌లైన్‌ అప్పు.. తప్పదు ముప్పు

అత్యవసరం, క్లిష్ట సమయంలో అప్పు లేదా రుణం తీసుకోవడం సహజం. ఇన్నాళ్లు ప్రత్యక్షంగా తీసుకున్న అప్పులతోనే అవస్థలకు గురికావాల్సి వచ్చేది.

Updated : 21 Mar 2023 08:18 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు గ్రామీణ, వికారాబాద్‌ మున్సిపాలిటీ: అత్యవసరం, క్లిష్ట సమయంలో అప్పు లేదా రుణం తీసుకోవడం సహజం. ఇన్నాళ్లు ప్రత్యక్షంగా తీసుకున్న అప్పులతోనే అవస్థలకు గురికావాల్సి వచ్చేది. సరైన సమయానికి చెల్లించకపోతే ఇంటి వద్దకు వచ్చి వారు చేసే రభస అంతా ఇంతా కాదు. ఇప్పుడు అంతకుమించి ఆగడాలకు పాల్పడుతున్నారు.. ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకులు. ఇష్టారీతిగా వడ్డీలు వసూలు చేయడం మొదలు, వారు అడిగినంత ఇవ్వకుంటే మానసికంగా వేధిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.


యాప్‌ లింక్‌లు క్లిక్‌ చేస్తే చిక్కినట్లే..

ఆన్‌లైన్‌లో ఎక్కువసేపు గడిపేవారికి రుణ యాప్స్‌కి సంబంధించిన లింకులు పంపుతారు. లేదా ఎలాంటి పత్రాలు (డాక్యుమెంట్లు) అవసరం లేకుండానే రెండు నిమిషాల్లో రుణం పొందండంటూ చరవాణికి సందేశాలు పంపుతారు.  వారు చెప్పినట్లే చేస్తే చాలు.. రూ.3 వేలు మొదలు రూ.50 వేల వరకు రుణాలు ఇస్తున్నారు. అక్కడి నుంచీ వారి ఆగడాలు మొదలవుతున్నాయి.  


ఆర్థిక కష్టాల్లో ఉన్నవారే అధికం

ఆయా యాప్‌లలో రుణాలు తీసుకునే వారిలో అత్యధికంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న చిన్న కుటుంబాలు, చిరువ్యాపారులు, కూలీ పనులు చేసుకునే వారే ఉన్నట్టుగా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇలా జిల్లాలో వేల సంఖ్యలో రుణాలు తీసుకుంటున్నట్లుగా వివరిస్తున్నారు.  

* ఈ తరహా వేధింపులు, మోసాలపై జిల్లాలో ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. రెండు కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును పోలీసులు తిరిగి రాబట్టారు.  


అవగాహన కల్పిస్తున్నాం
- సత్యనారాయణ, డీఎస్పీ, వికారాబాద్‌

రుణ యాప్‌ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయమై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అవగాహన కల్పిస్తున్నాం. తొందరపడి మోసపోవద్దు. ఎవరికీ వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు. తెలియకుండా మోసపోయామని గుర్తిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి.


కొన్ని ఉదాహరణలు

* వికారాబాద్‌ పట్టణానికి చెందిన ఓ యువకుడు కొంత కాలం క్రితం ఆన్‌లైన్‌ ద్వారా రుణం తీసుకున్న సమయంలో తన ఆధార్‌కార్డుతో పాటు తన తల్లి పాన్‌ కార్డును ఇచ్చాడు. దీంతో సదరు రుణ నిర్వాహకులు ఆమెను ఇబ్బందులకు గురిచేశారు. తీసుకున్న రుణం కంటే అదనంగా చెల్లించినా వారి వేధింపులు మాత్రం ఆగలేదు. దీనిపై వికారాబాద్‌ పోలీస్‌ ఠాణాలో ఆ యువకుడు ఫిర్యాదు చేశారు.

* మూడు మాసాల కిందట ఓ రుణ యాప్‌ నిర్వాహకులు పెట్టిన వేధింపులతో వికారాబాద్‌ పట్టణానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా అలాంటి వేధింపుల సంఘటనలు వెలుగు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని