logo

స్వప్నలోక్‌ అగ్నిప్రమాదం కేసులో ఇద్దరి అరెస్టు

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు నిందితులను మహంకాళి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Published : 29 Mar 2023 02:09 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు నిందితులను మహంకాళి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ నెల 16వ తేదీన స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ 5 అంతస్తులోని కేడియా ఇన్ఫోటెక్‌ సంస్థలో తొలుత అగ్ని ప్రమాదం సంభవించింది. క్రమంగా మిగతా అంతస్తులకు వ్యాపించడంతో భవనంలో ఉన్నవారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఐదో అంతస్తులోని క్యూనెట్‌ సంస్థలో పనిచేస్తున్న నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కేడియా ఇన్ఫోటెక్‌, క్యూనెట్‌ సంస్థల నిర్లక్ష్యంతోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. అబిడ్స్‌కు చెందిన కేడియా ఇన్ఫోటెక్‌ నిర్వాహకుడు అశోక్‌ కేడియా(60), క్యూనెట్‌ సంస్థ సీఈవో శివనాగమల్లయ్య (30)లను మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ రెండు సంస్థలతో పాటు స్వప్నలోక్‌, సూర్యకిరణ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అసోసియేషన్‌ తదితర సంస్థలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

సీసీఎస్‌కు బదిలీ

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తున్న క్యూనెట్‌ సంస్థ విషయం బయటపడింది. అక్కడి ఉద్యోగులు తాము రూ.లక్షలు చెల్లించామని మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 30మందికిపైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఈ కేసును మహంకాళి పోలీస్‌స్టేషన్‌ నుంచి నగర సీసీఎస్‌కు బదిలీ చేసినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని