logo

అమ్మలు.. ఆశయం వైపు అడుగులు

పిల్లలు, కుటుంబం కోసం కెరీర్‌ను త్యాగం చేసిన అమ్మలు ఎందరో మన ఇంట్లో, పక్క ఇంట్లో, ఎదురింట్లో కనిపిస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. మంచి కొలువు సాధించి తమ కాళ్లపై తాము నిలబడుతున్న దశలో పెళ్లి, పిల్లల కోసం ఇష్టమైన కెరీర్‌ను వదిలిపెట్టక తప్పని పరిస్థితి.

Published : 14 May 2023 04:13 IST

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెరీర్‌ ప్రారంభిస్తున్న మహిళలు
అవకాశాలు కల్పిస్తున్న పలు కార్పొరేట్‌ సంస్థలు

శిక్షణ పొందుతున్న మహిళలు

ఈనాడు, హైదరాబాద్‌: పిల్లలు, కుటుంబం కోసం కెరీర్‌ను త్యాగం చేసిన అమ్మలు ఎందరో మన ఇంట్లో, పక్క ఇంట్లో, ఎదురింట్లో కనిపిస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. మంచి కొలువు సాధించి తమ కాళ్లపై తాము నిలబడుతున్న దశలో పెళ్లి, పిల్లల కోసం ఇష్టమైన కెరీర్‌ను వదిలిపెట్టక తప్పని పరిస్థితి. ఇలాంటి వారు పిల్లలు కాస్త పెద్ద కాగానే తిరిగి కెరీర్‌ ప్రారంభించేందుకు అవకాశాలు పెరిగాయి. అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే శిక్షణ సంస్థలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఆత్మవిశ్వాసంతో పది, పదిహేను ఏళ్ల తర్వాత వృత్తి జీవితంలో అడుగుపెడుతున్నారు. శాస్త్రవేత్తలు సైతం తిరిగి పరిశోధనా ప్రాజెక్టుల్లో చేరుతున్నారు.
3,700 మందికి..  పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నా వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మాత్రం వీరి భాగస్వామ్యం తక్కువగా ఉంటోంది. వ్యాపారాలు వృద్ధి చెందాలన్నా.. ఉత్పాదకతలో పెంపుదల చూడాలన్నా మహిళా శ్రామిక శక్తిని వినియోగించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో ఉండే అపారమైన సామర్థ్యాలను వినియోగించుకునేలా శిక్షణ ఇస్తే చాలు వారిని భాగస్వాములను చేయవచ్చు. ముఖ్యంగా కుటుంబం కోసం కెరీర్‌ను మధ్యలో వదిలేసిన అమ్మల కోసం శిక్షణ సంస్థలు వెలిశాయి. వీరు రెజ్యూమ్‌ సిద్ధం చేసే దగ్గర్నుంచి.. ఇటీవల వచ్చిన ఆన్‌లైన్‌లో ప్రొఫెషనల్‌ ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేయడం వరకు నేర్పిస్తున్నాయి. మాక్‌ ఇంటర్వ్యూలు, పని ప్రదేశంలో ఉండాల్సిన నైపుణ్యాలు, కార్యశాలలు, పరిశ్రమ ప్రముఖులతో సంభాషణలతో వారిలోని బేరుకు పోగొట్టి ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చేస్తున్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ) మహిళలు తిరిగి పరిశోధనలు చేపట్టేలా వేర్వేరు పథకాల కింద ప్రత్యేక ప్రాజెక్టుల్లో చేరేందుకు అవకాశం ఇస్తోంది. ఈ విధంగా ఇటీవల కాలంలో 3,700 మంది చేరినట్లు డీఎస్‌టీ ప్రగతి నివేదికలో పేర్కొంది.


డాక్టర్‌గా నిలిచారు.. అమ్మగా గెలిచారు

కుమార్తె డాక్టర్‌ ఎలిజబెత్‌తో తల్లి డాక్టర్‌ జయలత

ఈనాడు, హైదరాబాద్‌: వృత్తిలో పడి ఎంతో మంది కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ ప్రభావం పిల్లల పెంపకంపైనా పడుతుంది. కానీ ఎంత బిజీగా ఉన్నా సరే.. అటు వృత్తి ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణిస్తూ అద్భుతాలు చేసే తల్లులు ఎందరో.. ఆ కోవలోకి చెందుతారు ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత. వృత్తిగత జీవితంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ఒక తల్లిగా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్‌ జయలత దంపతులిద్దరూ వృత్తి పరంగా వైద్యులే. ఆమె రేడియాలజిస్టు.. ఆయన ప్లాస్టిక్‌ సర్జన్‌. దంపతులిద్దరూ ఉదయం ఆసుపత్రికి వెళ్తే మళ్లీ ఇంటికి ఎప్పుడు చేరేది వాళ్ల చేతిలో ఉండదు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ల పెంపకం ఒక సవాలుగా మారేదని డాక్టర్‌ జయలత చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తన భర్త కూడా సంపూర్ణ సహకారం అందించడంతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లలను కెరీర్‌ పరంగా తీర్చిదిద్దగలిగామన్నారు. ‘మా అమ్మాయి...మమ్మల్ని చూసి చిన్నప్పటి నుంచే డాక్టర్‌ అవుతానని పట్టుపట్టింది. మాకైతే ముందు ఇష్టం లేదు. ఎంబీబీఎస్‌, పీజీ, సూపర్‌స్పెషాలిటీ...ఇవన్నీ పూర్తి అయ్యేసరికి 10-15 ఏళ్లు పడుతుంది. అంత ఓపిక ఉంటుందా భావించినా సరే...ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టుదలగా ఎంబీబీఎస్‌ పూర్తి చేసి.. అమెరికాలో పీజీ చేసేందుకు సిద్ధమైంది. మా అబ్బాయి ఇంజినీరింగ్‌ ఎంపిక చేసుకున్నాడు. పిల్లలకు నేను చెప్పేది ఒక్కటే. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని గట్టిగా ప్రయత్నిస్తే...సాధించక పోవడం అంటూ ఉండదు. ఏదైనా పిల్లలపై రుద్దకూడదు. వారిపై నమ్మకం ఉంచి... ఒక స్నేహితుడు, ఒక గైడ్‌లా వ్యవహరిస్తే చాలు...వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. ఒక వైద్యురాలిగా కేరీర్‌ పరంగా ఎంత తృప్తి ఉందో.. ఒక తల్లిగా పిల్లల కెరీర్‌ను తీర్చిదిద్దడంలో తన పాత్ర పోషించినందుకు అంతే తృప్తి ఉంది.


14 ఏళ్ల తర్వాత..
- ఏంజెలీనా డైసీ

సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి ఉద్యోగం సాధించడం కచ్చితంగా అంత సులభం కాదు. నైపుణ్యాలను పెంపొందించుకుని 14 ఏళ్ల విరామం తర్వాత మోటివిటీ ల్యాబ్స్‌లో అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌గా తిరిగి కెరీర్‌ను ప్రారంభించడం నాలో మరింత విశ్వాసాన్ని పెంచింది.


భయాలు పోగొట్టి..
- విశ్వేశ్వరి

ఉద్యోగం వదిలిపెట్టి ఆరేళ్లు అయ్యింది. తిరిగి కెరీర్‌ను ప్రారంభించేందుకు ఇంటర్వ్యూలు ఎదుర్కోవడం అన్నింటి కంటే పెద్ద సవాల్‌. దీన్ని అధగమించడానికి మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యా. కెరీర్‌ సేవలను వినియోగించుకుని క్యాప్‌జెమినిలో సీనియర్‌ అనలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించా.


చాలా అవకాశాలు ఉన్నాయ్‌..
-అరవింద్‌ తూపురాణి, ప్లేస్‌మెంట్స్‌ హెడ్‌, ఓడిన్‌ స్కూల్‌

కెరీర్‌ తిరిగి ప్రారంభించాలనుకునేవారికి ప్రస్తుతం పరిస్థితి చాలా అనుకూలం. ఉబర్‌, డన్‌ హంబీ, క్యాప్‌జెమిని, బ్లెండ్‌ 360, జీఎఫ్‌ కె, ఫోర్డ్‌, ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌, సిటీ బ్యాంకుతో సహా అనేక కార్పొరేట్‌ సంస్థలు మహిళలు, తల్లులను ఉద్యోగంలోకి ఆహ్వానిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని