logo

శాసన యుద్ధం.. సర్వం సిద్ధం

శాసన సభ ఎన్నికలకు రాజధాని సిద్ధమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు(ఆర్వో) మూడు జిల్లాల పరిధిలోని 10వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేశారు. టెంట్లు, కుర్చీలు, బల్లలు, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, చక్రాల కుర్చీలను సమకూర్చారు.

Published : 29 Nov 2023 04:38 IST

పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తయిన ఏర్పాట్లు
రేపు వేకువజామున   నమూనా ఎన్నిక

ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి సూచనలిస్తున్న పోలీసు అధికారి

ఈనాడు, హైదరాబాద్‌: శాసన సభ ఎన్నికలకు రాజధాని సిద్ధమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు(ఆర్వో) మూడు జిల్లాల పరిధిలోని 10వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేశారు. టెంట్లు, కుర్చీలు, బల్లలు, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, చక్రాల కుర్చీలను సమకూర్చారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల తరలింపు బుధవారం ఉదయం 10గంటలకు మొదలుకానుంది. ఇప్పటికే ఉద్యోగులకు విధులు నిర్వర్తించాల్సిన పోలింగ్‌ కేంద్రాల వివరాలు చేరాయి. వారంతా స్ట్రాంగ్‌ రూముల నుంచి ఎన్నికల సామగ్రి తీసుకుని రాత్రికల్లా పోలింగ్‌ కేంద్రానికి చేరుకుంటారు.

పోలింగ్‌ సిబ్బందికి అందించే సామగ్రి సంచుల్లో పెట్టి నిజాం కళాశాలలో సిద్ధం చేశారిలా

హైదరాబాద్‌లో 180 కేంద్రాలు: హైదరాబాద్‌ జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గానికి ఐదు కేంద్రాల్లో ఓటరులో ఉన్నతమైన భావన కలిగేలా ఆధునిక, ఆకర్షణీయ సౌకర్యాలు కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌ స్పష్టం చేశారు. మొత్తం 75 కేంద్రాలను ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దామన్నారు. మహిళా ఓటర్లను, దివ్యాంగులు, యువ ఓటర్లలో స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా.. 15 యువ, 15 దివ్యాంగ, 75 మహిళా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాట్లు

సూర్యోదయానికి ముందే..

పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ సూర్యోదయానికి ముందే మొదలవుతుంది. ముందు రోజు రాత్రే అధికారులు పోలింగ్‌ కేంద్రానికి చేరుకుంటారు. వేకువజామునే ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఓటరు గదిని సిద్ధం చేసుకుని.. 5.30గంటలకు నమూనా ఎన్నిక చేపడతారు. ఆసమయానికి కనీసం ఇద్దరు పోలింగ్‌ ఏజెంట్లు ఉండాలనేది నిబంధన. ఏజెంట్లు 5.45గంటల వరకు రాకపోతే.. వారితో పనిలేకుండా నమూనా ఎన్నిక పూర్తి చేస్తారు.

ఓటర్లంతా కదిలిరావాలి

పవిత్ర ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ఓటర్లంతా పోలింగ్‌ కేంద్రాలకు రావాలని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల ఎన్నికల అధికారులు భారతి హొలికేరి, గౌతమ్‌ పోట్రు పిలుపునిచ్చారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకున్న యువతీయువకులంతా ఓటు హక్కు వినియోగించుకుని తొలి ఓటు అనుభూతులు పొందాలని సూచించారు. వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని