logo

పోరుకు ముందు హోరు

సుమారు నెలరోజులపాటు నగరంలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలు, పార్టీల జాతీయ స్థాయి నాయకుల రాకతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Updated : 29 Nov 2023 06:22 IST

గ్రేటర్‌లో నెలకుపైగా సాగిన ఎన్నికల ప్రచారం
ప్రధాని, ముఖ్యమంత్రుల రాకతో వేడెక్కిన రాజకీయం

రోడ్‌షోలతో ఓటర్ల చెంతకు ప్రధాన పార్టీలు

ఈనాడు, హైదరాబాద్‌: సుమారు నెలరోజులపాటు నగరంలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలు, పార్టీల జాతీయ స్థాయి నాయకుల రాకతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా స్టార్‌ క్యాంపైనర్లు ప్రచారం నిర్వహించారు. తొలుత మందకొడిగా ప్రచారం మొదలైనా.. ఆఖర్లో వేగం పెంచారు. చివరి నిమిషం వరకు వేర్వేరు కార్యక్రమాలతో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేశారు.

భారాస.. ప్రచారంలో ముందంజలో..

హ్యాట్రిక్‌ కొట్టాలని భారాస అందరి కంటే ముందుగా ఆగస్టులో అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత నియోజకవర్గం, డివిజన్లలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. షెడ్యూల్‌ వెలువడిన అనంతరం క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలెట్టారు. భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ 18 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు.

కాంగ్రెస్‌.. అగ్రనేతలతో ఊపు

నగరంలో కాంగ్రెస్‌ ప్రచారం అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల తర్వాత ఊపందుకుంది. మూడు వారాల గడువే మిగలడంతో ఇంటింటికి ప్రచారం కంటే రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు, అగ్రనేతల సభలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ప్రచారంలో పాల్గొని పార్టీ వాణి వినిపించారు.  

ఆఖర్లో దూకుడు పెంచిన భాజపా..

భారతీయ జనతాపార్టీ అగ్రనేతలను రప్పించి మిగతా పార్టీల కంటే ఆఖర్లో దూకుడు పెంచింది. ప్రచార గడువు ముగియడానికి ఒక్కరోజు ముందు సిటీలో రోడ్‌షో నిర్వహించారు. హోంమంత్రి అమిత్‌షా ఆరు రోజులపాటు ఇక్కడ ప్రచారానికి సమయం కేటాయించారు. కేంద్రమంత్రులు, యూపీ, గోవా, అసోం ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహించారు.

  • పాతబస్తీలో ఎంఐఎం అగ్రనేతలు గతం కంటే ఎక్కువగా ప్రచారంలో పాల్గొన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రోజుల తరబడి మకాం వేసి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని