logo

పోలింగ్‌ శాతం.. పెరిగేనా?

శాసనసభ ఎన్నికల పోలింగ్‌ మరో 48 గంటల్లో ప్రారంభంకానుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 28 అసెంబ్లీ నియోజవర్గాల్లో 1.08 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిందరి ఓట్లు పొంది ఎన్నికల్లో గెలిచేందుకు భారాస, భాజపా, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.

Published : 29 Nov 2023 04:50 IST

శివారు నియోజకవర్గాల్లో  భారీ సంఖ్యలో ఓటర్లు
సగం మందే ఓటు హక్కు వినియోగం

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల పోలింగ్‌ మరో 48 గంటల్లో ప్రారంభంకానుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 28 అసెంబ్లీ నియోజవర్గాల్లో 1.08 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిందరి ఓట్లు పొంది ఎన్నికల్లో గెలిచేందుకు భారాస, భాజపా, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. తమ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. అభ్యర్థులు ప్రచారం నిర్వహించినా... అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసినా ఓటర్లు పోలింగ్‌ బూత్‌ వరకూ వెళ్లి ఓట్లేస్తే ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయానికి గుర్తింపు లభించనుంది. 2018లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సగటున యాభైశాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజా ఎన్నికల్లో శివారు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు పెరిగారు. వీరంతా ఓట్లేస్తే పోలింగ్‌ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

లక్షకు పైగా పెరిగిన ఓటర్లు... 2018 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే... శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఉప్పల్‌ నియోజవర్గాల్లో సగటున ఒక్కో నియోజకవర్గంలో లక్ష మంది ఓటర్లు పెరిగారు. పద్దెనిమిదేళ్ల యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవడం, పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డులు పొందేందుకు ఓటరు గుర్తింపు కార్డు ప్రామాణికం కావడంతో ఓటరుగా నమోదు చేసుకునేందుకు వేలమంది దరఖాస్తులు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం 7.52లక్షల ఓటర్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఆవిర్భవించింది. మేడ్చల్‌ జిల్లాల్లో కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో వరుసగా 6.99 లక్షలు, 6.37 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కనీసం 70శాతం మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఎన్నికల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మేడ్చల్‌ నియోజకవర్గంలో 60, శేరిలింగంపల్లిలో 48.61 శాతం

2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్‌ నియోజకవర్గంలో 60.72శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. శేరిలింగంపల్లిలో 48.61శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదయ్యింది. ఓటర్లు నిరాసక్తత ప్రదర్శించడమే ఇందుకు ప్రధాన కారణం. రాజేంద్రనగర్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో 56 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాతి స్థానాల్లో మహేశ్వరం-55.34శాతం, ఉప్పల్‌-51.05శాతం, ఎల్బీనగర్‌-49.83శాతం మంది ఓటర్లు పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓట్లు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని