logo

మా వద్ద ఓట్లున్నాయ్‌.. మీ రేటెంత!

‘మా వాళ్లందరి ఓట్లు 800 ఉన్నాయి. ఇప్పటి వరకు మేం ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకోలేదు. మా నాయకుడు చెప్పాడని.. మీ వద్దకు వచ్చాం. ఓటుకు రూ.5000 ఇస్తే మొత్తం మీకే. కాదంటే.. మరో పార్టీ నుంచి పిలుపు వచ్చింది.

Updated : 29 Nov 2023 06:17 IST

ఈనాడు, హైదరాబాద్‌ - రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ‘మా వాళ్లందరి ఓట్లు 800 ఉన్నాయి. ఇప్పటి వరకు మేం ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకోలేదు. మా నాయకుడు చెప్పాడని.. మీ వద్దకు వచ్చాం. ఓటుకు రూ.5000 ఇస్తే మొత్తం మీకే. కాదంటే.. మరో పార్టీ నుంచి పిలుపు వచ్చింది. సగం అడ్వాన్స్‌ పంపితే.. మీకే కట్టుబడి ఉంటా’మంటూ జూబ్లీహిల్స్‌ పరిధిలోని హోటల్‌లో మధ్యవర్తితో గల్లీ నేత సాగించిన సంభాషణ.

‘‘ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని ఫంక్షన్‌హాల్‌. వారం రోజులుగా అక్కడ ఘుమఘుమలాడే వంటకాలు సిద్ధం చేస్తున్నారు. కనీసం 1000 మందికి సరిపడా మాంసాహారం వండి వడ్డిస్తున్నారు. దీనికయ్యే ఖర్చంతా ప్రముఖ బిర్యానీ హోటల్‌ నిర్వాహకులు భరిస్తున్నారు. ఇక్కడికి రాలేని వారి ఇంటికే పార్శిల్‌ పంపుతున్నామ’’ని స్థానిక నాయకులు తెలిపారు. టోలిచౌకి ప్రాంతంలో ఆదివారం నుంచి విందు భోజనం సిద్ధం చేయటం విశేషం.  డివిజన్లవారీగా ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు, తటస్థ ఓటర్ల వివరాలు రాబడుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకం కావటంతో గల్లీ నాయకులు, చోటా నేతలు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. కుల, మత, కాలనీ సంఘ నేతలు అభ్యర్థులతో మంతనాలు ప్రారంభించారు. తమ చేతిలో ఉన్న ఓట్లన్నీ గంపగుత్తగా వేయిస్తామంటూ హామీ ఇస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల మధ్య నెలకొన్న పోటీ ఆధారంగా ఓటుకు రేటు నిర్ణయిస్తున్నారు. ద్విముఖ పోటీ ఉన్న చోట రూ.5000-6000.. త్రిముఖ పోటీ ఉన్న ప్రాంతాల్లో రూ.1500-2000లకు దళారులు బేరసారాలు సాగిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఎల్బీనగర్‌, మల్కాజగిరి, మహేశ్వరం, చేవెళ్లలో ఓట్ల రాయబేరాలు భారీ ఎత్తున సాగుతున్నట్లు సమాచారం.  

కాంగ్రెస్‌, భారాస వర్గీయుల ఘర్షణ

బోరబండ న్యూస్‌టుడే: ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ భారాస, కాంగ్రెస్‌ వర్గీయులు రెహ్మత్‌నగర్‌ డివిజన్‌ పరిధి మహాత్మనగర్‌లో బాహాబాహీకి దిగారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిశాక.. డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగాయి. కాంగ్రెస్‌ నేత జేపీ జ్ఞానేశ్వర్‌, భారాస నాయకుడు కె.ఆనంద్‌ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో జ్ఞానేశ్వర్‌ తీవ్రంగా గాయపడ్డారు. జూబ్లిహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజహరుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌, కార్పొరేటర్‌ సీఎన్‌రెడ్డి బోరబండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జ్ఞానేశ్వర్‌, ఆనంద్‌ ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు.

ఎల్బీనగర్‌లో ‘మనీ’పర్సుల పంపిణీ

నగర శివారు ఎల్బీనగర్‌లో ఓ పార్టీ కొత్త తరహాలో నగదు పంపిణీ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని ఓ డివిజన్‌లో ప్రధాన పార్టీ అభ్యర్థి సతీమణి ఆదివారం రాత్రి మనీపర్సులు పంచిపెట్టారు. దాన్ని తెరచి చూడగా రూ.2000(నాలుగు రూ.500 నోట్లు) కనిపించాయి. పెద్ద మొత్తంలో కమీషన్లు కొడతారు.. మాకేమో రెండు, మూడు వేల రూపాయలు ఇస్తారంటూ ఒక వ్యక్తి ప్రస్తావించగా.. రూ.రెండు వేలు వచ్చినయ్‌గా అన్నా ఇంకేందంటూ మరో వ్యక్తి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సాగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని