logo

ఎన్నికల్లో అక్రమాలా.. ఫిర్యాదు చేయండిలా

ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లే హక్కు పౌరులకు ఉంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎన్నికల సంఘం కొత్త పద్ధతులతో ఓటర్ల ముందుకు వచ్చింది. ఈ విధానంలో ఎవరు ఫిర్యాదు చేశారన్నది ఇతరులకు తెలిసే అవకాశమే లేదు.

Updated : 29 Nov 2023 06:13 IST

ఓటరు చేతిలో సి-విజిల్‌ అస్త్రం
వంద నిమిషాల్లోనే ప్రతి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లే హక్కు పౌరులకు ఉంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎన్నికల సంఘం కొత్త పద్ధతులతో ఓటర్ల ముందుకు వచ్చింది. ఈ విధానంలో ఎవరు ఫిర్యాదు చేశారన్నది ఇతరులకు తెలిసే అవకాశమే లేదు. ప్రతిఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లో తొలుత సి-విజిల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఎక్కడ అక్రమాలు జరిగినా.. ఫొటోలు, వీడియోలతో కలిపి దీంతో ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. 100 నిమిషాల్లోనే చర్యలు ఉంటాయంటున్నారు.

ఇలాంటి వాటిని గుర్తిస్తే..

  • ఓటర్లకు నగదు పంపిణీ, మద్యం, ఇతర మత్తు పదార్థాల అందజేత
  • మహిళలు, యువతకు వంటింటి, క్రీడా సామగ్రి, ఇతర బహుమతులు
  • ఓటు వేయలేదనే ఉద్దేశంతో ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం
  • కులమత ద్వేషాలను రెచ్చగొట్టేలా ఆయా పార్టీలు, అభ్యర్థుల తీరు
  • సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం చేయడం
  • తమకే ఓటు వేయాలని ఓటర్ల వద్దకు వెళ్లి బెదిరించడం
  • ఓటింగ్‌ వేళ మారణాయుధాలు ధరించడం

సత్వరమే విచారణ

యాప్‌తో వచ్చిన ఫిర్యాదును ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారి ఫీల్డ్‌ యూనిట్‌కి పంపిస్తారు. మరో 15 నిమిషాల్లో విచారణ సిబ్బంది ఫిర్యాదు వచ్చిన ప్రాంతానికి చేరుకుంటారు. 30 నిమిషాల్లో విచారించి వారిచ్చే నివేదిక ఆధారంగా రిటర్నింగ్‌ అధికారి మొత్తంగా 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పక్షంలో 1950కు కాల్‌ చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని