logo

గొడవలొద్దు.. కేసుల్లో ఇరుక్కోవద్దు!

ఎలాగైనా గెలిచి ప్రత్యర్థిని ఓడించాలని ఎన్నికల్లో ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానుల అంతరంగం మిది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు కయ్యానికి కాలుదువ్వడం, రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూ గొడవలకు దిగుతుంటారు.

Published : 29 Nov 2023 05:31 IST

నగరంలో పార్టీ శ్రేణులకు నాయకుల హెచ్చరిక

ఈనాడు, హైదరాబాద్‌: ఎలాగైనా గెలిచి ప్రత్యర్థిని ఓడించాలని ఎన్నికల్లో ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానుల అంతరంగం మిది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు కయ్యానికి కాలుదువ్వడం, రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూ గొడవలకు దిగుతుంటారు. నగరంలోని చాంద్రాయణగుట్ట, నాంపల్లి, యాఖుత్‌పుర, మలక్‌పేట, జూబ్లీహిల్స్‌, ముషీరాబాద్‌ వంటి శాసనసభ నియోజకవర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆకతాయిలు, అల్లరిమూకలను కట్టడి చేసేందుకు ముందునుంచే చర్యలు చేపడుతున్నారు. పెట్టీ కేసులు, బైండోవర్లు, కౌన్సెలింగ్‌తో భయపడిన వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులకు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రధాన పార్టీకి చెందిన ఓ నాయకుడు కొద్దిరోజుల క్రితం నగరంలో సమావేశం నిర్వహించి ఈ నెల 30న పోలింగ్‌ కేంద్రాలు, కాలనీల్లో ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దని సూచించారు. తన మాట కాదని ఇతర పార్టీలు, నాయకులతో ఘర్షణపడి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే తన నుంచి ఎటువంటి సహాయం ఉండదని చెప్పినట్లు సమాచారం. ఎన్నికల యంత్రాంగం, పోలీసు అధికారులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కఠినంగా వ్యవహరించటం ఈ మార్పునకు కారణమంటూ నగరానికి చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని