logo

ఓటు వేయండి..నలుగురితో వేయించండి

ఓటేయడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో సమర్థులు, ప్రజలకు అందుబాటులో ఉండే నేతను ఎంపిక చేసుకోవాలి. విద్యావంతులు, అవినీతికి దూరంగా ఉండేవాళ్లను గుర్తించి ఓటేయాలి.

Updated : 30 Nov 2023 05:34 IST

సామూహికంగా కదిలివెళ్లండి: కేవీ ప్రదీప్‌, నటుడు

 ఓటేయడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో సమర్థులు, ప్రజలకు అందుబాటులో ఉండే నేతను ఎంపిక చేసుకోవాలి. విద్యావంతులు, అవినీతికి దూరంగా ఉండేవాళ్లను గుర్తించి ఓటేయాలి. పార్టీ చరిత్రను పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థినిబట్టే ఓటేయాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అభివృద్ధి చేసిన నేతలు ఎంతోమంది ఉన్నారు. మీ కుటుంబంతో పాటు, సన్నిహితులు, ఇంట్లో పనిచేసే వాచ్‌మెన్‌ని కూడా ఓటేయమని ప్రోత్సహించండి. మీరంతా వెళ్లి ఓటేసి ఇతరులూ వేసేలా చూడండి.


వాట్సప్‌లో ఫొటో పెట్టాలని చెప్పాను
-సాయిరాజేశ్‌, డైరెక్టర్‌

నా తొలి ఓటును 18ఏళ్ల వయసులో నెల్లూరులో వేశా. పదిహేనేళ్లుగా రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నాను. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఉదయాన్నే 10గంటలకు ఓటేస్తాను. నా సిబ్బందికి అదే చెబుతున్నాను. అభివృద్ధి, ప్రశాంత వాతావరణం, ఎవరు పిలిచినా పలికే నాయకుడికే ఓటేస్తాను. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు..అభివృద్ధి చేయగలరా అన్న విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. నవంబర్‌ 30న అందరూ ఓటేసి ఫొటోను వాట్సప్‌ చేయాలని నా సిబ్బందికి చెప్పాను.


ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి: వి.వి.లక్ష్మీనారాయణ

అందరూ బాధ్యతగా ఓటేయాలి. చుట్టుపక్కలవాళ్లూ ఓటేసేలా చేసి అందరూ కలిసి పోలింగ్‌బూత్‌కి వెళ్లండి. అభివృద్ధి కాంక్ష ఉండే అభ్యర్థులకు ఓటేయండి.. ఎన్నికల సంఘం సైతం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓటింగ్‌ పెంచేందుకు కొత్త విధానాలను అవలంబించాలి. మల్టిపుల్‌ ఈవీఎంలను తీసుకొచ్చి ఎక్కడి నుంచైనా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. పలు దేశాల్లో ఓటింగ్‌ తప్పనిసరి నిబంధనలున్నాయి. మనదేశంలో అలాంటి నిబంధన అమలు చేయడంలేదు. దీన్ని అలుసుగా తీసుకొని ఓటు వేయకపోవడం సరికాదు.


విజ్ఞతతో ఓటేయాలి: ఆర్పీ పట్నాయక్‌, సంగీత దర్శకుడు

నాలుగోసారి బంజారాహిల్స్‌లో నా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. ఎన్నికల రోజు సెలవని విశ్రాంతి తీసుకోవద్దు. రోజూ చేసేపనికి విరామమిచ్చి మరీ చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలి. విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలి. నచ్చిన అభ్యర్థికి ఓటేస్తే అవతలి వ్యక్తి గెలిచినా మెజార్టీ తగ్గుతుంది. దీంతో తదుపరి ఎన్నికల్లో ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనసు మాట విని ఓటేయాలి తప్ప.. గాలి ఎటుందో అని చూడకూడదు.


ఓటరు మౌనం.. లీడర్‌ అంతర్మథనం

ఈనాడు, హైదరాబాద్‌: అబ్బే.. ఇతర పార్టీల నుంచి పోటీనే లేదు. అధిక మెజార్టీతో గెలిచి తీరతాం.. ఇదీ రెండుమూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఓ నేత ధీమా. ఇప్పుడా నియోజకవర్గంలో మారిన వాతావరణంతో ప్రస్తుతం స్వల్పమెజార్టీతో నెగ్గితే అదే చాలంటూ పార్టీశ్రేణులను వేడుకుంటున్నారు.  

  •   ఆ పార్టీది అక్కడ దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం. మరో పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా పూచికపుల్లగా భావించేవారు. గతానికి భిన్నంగా, తొలిసారి నియోజకవర్గ ఓటర్లు కొత్త నాయకత్వం కోరుకుంటున్నారని తెలియగానే బుజ్జగింపులు మొదలెట్టారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తంటాలు పడుతున్నారు.

ఇదీ నగరంలో అధికశాతం నేతల పరిస్థితి. సర్వేల్లో విజయం పక్కా.. అని భావించిన అభ్యర్థులు మారిన పరిణామాలతో గుబులు చెందుతున్నారు. పలువురు ప్రధానపార్టీల నేతలు ఓటరు మౌనం వెనుక అంతరార్థం గ్రహించలేక అంతర్మథనంలో ఉన్నారు. ప్రముఖులు నివాసముండే ఓ నియోజకవర్గంలోనూ ప్రధాన పార్టీ నేత భారీ మెజార్టీ ఖాయమని గతంలో అనుకోగా, ఇప్పుడు  గెలిస్తే చాలని భావిస్తున్నట్టు సమాచారం.

మనసులో ఏముందో..

ఎంత ప్రచారం చేసినా, చివరికి ఓటరు మనసులో ఏముందనేది అంచనా వేయడం సవాల్‌గా మారిందని ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి తెలిపారు. కాలనీ, కుల సంఘాల నేతలు.. తమ మద్దతుంటుందని రెండు మూడు పార్టీలవారికి చెప్పడంతో ఏ వైపు ఉంటారో నిర్ధారించలేని పరిస్థితి. కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌ల్లో ఓటరు మనసు తెలుసుకునేందుకు సర్వే చేసినా ఎవరిది గెలుపో అంచనా వేయలేకపోయామని ఓ సంస్థ వారు చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని