logo

ఓటేద్దాం.. కదిలి రండి

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని విధాల రంగం సిద్ధం చేశారు. జిల్లాలోని నాలుగు (వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌) నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు

Published : 30 Nov 2023 04:31 IST

బొంరాస్‌పేటలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన పోలింగ్‌ కేంద్రం

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని విధాల రంగం సిద్ధం చేశారు. జిల్లాలోని నాలుగు (వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌) నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నేడు (గురువారం) ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించారు. సలహా సిబ్బందిని అందుబాటలో ఉంచారు.  

 చేరుకున్న సిబ్బంది

జిల్లాలో నాలుగు పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటుచేశారు.సిబ్బంది సామగ్రితో వారికి కేటాయించిన కేంద్రాలకు బుధవారం సాయంత్రం నాటికే చేరుకున్నారు. రూట్‌ల వారీగా ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేట్‌ వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని చేర్చారు
* ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవటానికి రెండు రోజుల క్రితమే ఓటరు చీటీలను బీఎల్‌ఓలు పంపిణీ చేశారు.  

విలువ గుర్తించాలి  

వికారాబాద్‌: జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి నేడు వికారాబాద్‌ పట్టణంలోని సంగం లక్ష్మీ భాయి గురుకుల పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేయబోతున్నారు. ఈ సందర్భంగా వారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటేసేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఓటుహక్కు పొందిన యువత ఏ మాత్రం జాప్యం చేయవద్దన్నారు. ఓటు విలువ తెలుసుకొని ఎలాంటి ఒత్తిడి, ప్రలోభాలకు లొంగకుండా నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు చొరవ చూపాలని కోరారు.మహిళలు సైతం ముందుకు రావాలన్నారు.

పకడ్బందీ బందోబస్తు : ఎస్పీ

ఎన్నికలకు అవసరమైన పకడ్బందీ  బందోబస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా పోలీసు అధికారి కోటిరెడ్డి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్‌ కేంద్రాలు,  రూట్లలో పటిష్ఠ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నామన్నారు. అతి సున్నిత, సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా నిరంతరం పరిస్థితిని వీక్షించనున్నట్లు తెలిపారు.

  • జిల్లాలోని 19 పోలీస్‌ఠాణాల ఎస్‌ఐల పర్యవేక్షణలో క్యూఆర్‌ టీం, సీఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు విధులు నిర్వహిస్తాయన్నారు.  
  • జిల్లా అదనపు ఎస్పీ మురళీధర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించటానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామన్నారు.  
  • లక్ష వలస ఓట్లు
  • జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు ఉండగా, వీరిలో దాదాపు లక్ష మంది వరకు ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. వెయ్యి ఓటర్లున్న ఓ గ్రామంలో వంద మంది వరకు ఓటర్లు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌, బెంగుళూరు, ముంబయి, పుణె వంటి నగరాలకు వలస వెళ్లారు. వీరి ఓట్లు కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని