logo

అభ్యర్థుల్లో గుర్తుల గుబులు

అభ్యర్థుల్లో క్రాస్‌ ఓటింగ్‌ టెన్షన్‌ మొదలైంది. తమ పార్టీ గుర్తులను పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడంతో గెలుపుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో ఉన్నారు.  ప్రధానంగా భారాస పార్టీ అభ్యర్థులను కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌, చపాతీ రోలర్‌ గుర్తులు ఇబ్బంది పెడుతున్నాయి

Published : 30 Nov 2023 04:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: అభ్యర్థుల్లో క్రాస్‌ ఓటింగ్‌ టెన్షన్‌ మొదలైంది. తమ పార్టీ గుర్తులను పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడంతో గెలుపుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో ఉన్నారు.  ప్రధానంగా భారాస పార్టీ అభ్యర్థులను కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌, చపాతీ రోలర్‌ గుర్తులు ఇబ్బంది పెడుతున్నాయి. గత ఎన్నికల్లోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. 2018 ఎన్నికల్లో అంబర్‌పేట భారాస అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌ 1,016 స్వల్ప తేడాతో గెలిచారు. ఇక్కడ ట్రక్కు గుర్తు అభ్యర్థికి 1,052 ఓట్లు పడ్డాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో రిక్షా గుర్తుతోనూ ఇదే సమస్య ఎదురైంది. చేవెళ్లలో టీఆర్‌ఎస్‌ 781 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ ఆటో రిక్షా గుర్తుకు 3,719 ఓట్లు వచ్చాయి.

  • ఒకేలా ఉన్నవి ఇవే.. యుగ తులసి పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్న ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు రోడ్డు రోలర్‌ గుర్తును  కేటాయించారు.
  •  రాజేంద్రనగర్‌  నుంచి నవరంగ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ అబ్దుల్‌ అజీజ్‌కు రోడ్డు రోలర్‌ చిహ్నాన్ని  కేటాయించారు.ః షాద్‌నగర్‌, చేవెళ్ల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న నరసింహ, తుడుము పాండులకు రోడ్డు రోలర్‌ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు.
  •  ఎల్బీనగర్‌, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ అభ్యర్థులకు చపాతీ రోలర్‌ గుర్తు కేటాయించారు.
  • గ్లాసు, బకెట్‌ తకరారు: కూకట్‌పల్లి  నుంచి పోటీలో ఉన్న జనసేనకు ఇదే చిక్కొచ్చి పడింది. జాతీయ జనసేన పార్టీ తరఫున కూడా  ఇక్కడ అభ్యర్థి బరిలో ఉన్నారు. జనసేన గుర్తు ‘గాజు గ్లాసు’ కాగా.. జాతీయ జనసేనకు ‘బకెట్‌’ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.  పార్టీల పేర్లూ ఒకేలా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే ఆస్కారం ఉంది. గాజు గ్లాసు గుర్తును శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రాజమహేంద్ర కటారి, సుబ్రహ్మణ్య రాహూల్‌కు కేటాయించారు. కల్వకుర్తిలో ఎస్‌యూసీఐ పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు కేటాయించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని