logo

పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు

 రాజధానిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సర్వం సిద్ధం చేశారు. డీఆర్‌సీ కేంద్రాల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎం తరలింపు.. ఓటింగ్‌ పూర్తయ్యాక స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచే వరకూ బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated : 30 Nov 2023 05:28 IST

 స్ట్రాంగ్‌రూంల చెంత మూడంచెల భద్రత

 ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సర్వం సిద్ధం చేశారు. డీఆర్‌సీ కేంద్రాల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎం తరలింపు.. ఓటింగ్‌ పూర్తయ్యాక స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచే వరకూ బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రానికి డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు.. కేంద్ర బలగాలు, ఇతర జిల్లాల నుంచి అదనపు పోలీసు సిబ్బంది కలిపి దాదాపు 30 వేల మందికి విధుల కేటాయింపు పూర్తయింది. మొత్తం 78 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. మూడు కమిషనరేట్లలో కలిపి 8,290 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వాటిలో 2 వేల వరకూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నట్లు గుర్తించారు. దీనికి తగినట్లు భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాలవారీగా సిబ్బందికి రూట్‌మ్యాప్‌ నిర్దేశించారు. ఈ మార్గాల్లో మాత్రమే ఎన్నికల సిబ్బంది ప్రయాణించాల్సి ఉంటుంది.

 అలాంటి కేంద్రాల వద్ద సంయుక్తంగా..

 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల దగ్గర కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా విధుల్లో ఉంటాయి. ఒక్కో కేంద్రంలో నలుగురు కేంద్ర సాయధ సిబ్బంది, వారికి ఒక ఎస్సై ఇన్‌ఛార్జిగా ఉంటారు. ఒకే చోట ఎక్కువ సమస్యాత్మక కేంద్రాలుంటే ఐదుగురు చొప్పున ఉంటారు. సాధారణ పోలింగ్‌ బూత్‌లో ఒక కానిస్టేబుల్‌ విధుల్లో ఉంటారు. భద్రతా సిబ్బంది పూర్తిగా పోలింగ్‌ కేంద్రం వెలుపలే గస్తీలో ఉంటారు. వారు కాకుండా పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్‌, సత్వర స్పందన బృందం(క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌), స్పెషల్‌ స్ట్రెకింగ్‌ ఫోర్స్‌, రూట్‌ మొబైల్స్‌ అందుబాటులో ఉంటాయి. ఘర్షణ చెలరేగినా.. పోలింగ్‌ కేంద్రాల దగ్గర అనూహ్య పరిస్థితులు ఏర్పడ్డా.. వెంటనే చేరుకునేలా పోలీస్‌స్టేషన్‌, డివిజన్‌, జోనల్‌ స్థాయిలో ఇన్‌స్పెక్టర్‌, ఏసీపీ, డీసీపీ స్థాయిలో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. అదనంగా ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు విధుల్లో ఉంటాయి. పోలింగ్‌ కేంద్రాల దగ్గర 200 మీటర్ల లోపు నలుగురికి మించి గుమిగూడకుండా ఆదేశాలిచ్చారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా తనిఖీలు ముమ్మరం చేశారు.

స్ట్రాంగ్‌ రూముల వద్ద 144 సెక్షన్‌

పోలింగ్‌ ముగిసిన వెంటనే ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్‌ రూములకు తరలించేందుకు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడకు తీసుకెళ్లాల్సిన మార్గాల ఖరారు పూర్తయింది. పోలీసు భద్రత మధ్య వీటిని తరలిస్తారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద 144 సెక్షన్‌తో పాటు మూడంచెల భద్రత విధానాన్ని అమలుచేయనున్నారు. తొలి అంచెలో పారామిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, మూడోదశలో సివిల్‌ పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు. అగ్నిప్రమాదాలకు అవకాశం లేకుండా ఫైరింజన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 16 ఓట్ల లెక్కింపు కేంద్రాలున్నాయి.


మహా నగరంలో పోలింగ్‌ కేంద్రాలు

కమిషనరేట్‌  కేంద్రాలు  సమస్యాత్మకం
హైదరాబాద్‌   1,700      666

రాచకొండ    3,388     701
సైబరాబాద్‌    3,202     655

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని