logo

డబ్బుతో దొరికితే.. దంచుడే!

ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న చోటామోటా నేతలకు ప్రత్యర్థి పార్టీల భయం పట్టుకుంది

Updated : 30 Nov 2023 05:24 IST

ఓటర్లకు నగదు పంపిణీ చేసే ప్రత్యర్థి పార్టీలపై నిఘా

ఈనాడు, హైదరాబాద్‌: ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న చోటామోటా నేతలకు ప్రత్యర్థి పార్టీల భయం పట్టుకుంది. నోట్ల కట్టలతో కాలనీలు, గల్లీల్లో కనిపిస్తే చాలు.. ముందు వెనకా చూడకుండా నాయకులు దాడులకు దిగుతున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని వారే పోలీసులకు అప్పగిస్తున్నారు. రాజధానిలో ఎన్నికల ప్రచారం ముగిసిన నాటి నుంచి ఈ తరహా ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నాయి. డివిజన్‌ స్థాయి నాయకులకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఇవి తమకు పడే ఓట్లపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్న నాయకులు తమ అనుచరుల ద్వారా ఎక్కడికక్కడ పంపిణీని అడ్డుకుంటున్నారు. ఓ వైపు తమ డబ్బు పంచుతూనే.. అవతలి పార్టీ వారిపై కన్నేసి ఉంచుతున్నారు.

  • గాంధీనగర్‌లో ఓ పార్టీ నేత ఓటర్లకు పంచేందుకు రూ.18 లక్షలతో వెళుతుండగా, ప్రత్యర్థి పార్టీ నేతలు అడ్డగించి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
  •  జూబ్లిహిల్స్‌ నియోజకవర్గం బోరబండలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ భారాస, కాంగ్రెస్‌ నాయకులు పరస్పరం దాడులకు దిగారు. పోలీసుల రంగప్రవేశం చేసి ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
  • ముషీరాబాద్‌ నియోజకవర్గం కవాడిగూడలో ఓ పార్టీవారు డబ్బు పంచుతున్నారనే సమాచారంతో ప్రత్యర్థి పార్టీ నేతలు అడ్డగించి దాడికి దిగారు. ఒకరి కంటికి గాయమైంది.
  •  మేడిపల్లిలో అబ్కారీ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఓ పార్టీ తరఫున డబ్బు పంపిణీ చేసేందుకు వెళ్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేతలు అడ్డగించారు. రూ.6 లక్షలు వెలుగుచూడటంతో సదరు ఇన్‌స్పెక్టర్‌పై చేయి చేసుకున్నారు.
  •  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ భారాస నాయకులు అడ్డుకున్నారు. ఓ వ్యక్తిపై కొందరు దాడి చేశారు.
  •  మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ పార్టీ నేతలు డబ్బు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డగించాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చెదరగొట్టారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని