logo

కొనుగోలులో పోటాపోటీ

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాజధానిలో గెలిచే స్థానాలే కీలకం కావడంతో కనీసం 15 నుంచి 18 సీట్లు దక్కించుకునేందుకు అధికార భారాస, కాంగ్రెస్‌ అగ్రనేతలు చివరి క్షణంలో కూడా ఎత్తులు వేస్తున్నారు

Published : 30 Nov 2023 05:10 IST

 నియోజకవర్గ నేతలకు కోట్ల కుమ్మరింపు

 విడతల వారీగా ఓటర్లకు తాయిలాలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాజధానిలో గెలిచే స్థానాలే కీలకం కావడంతో కనీసం 15 నుంచి 18 సీట్లు దక్కించుకునేందుకు అధికార భారాస, కాంగ్రెస్‌ అగ్రనేతలు చివరి క్షణంలో కూడా ఎత్తులు వేస్తున్నారు. పోలింగ్‌ మొదలయ్యే గురువారం ఉదయం నాటికి ప్రతి నియోజకవర్గంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. దీంతో నగర పరిధిలో రాజకీయం రసవత్తరంగా మారింది.

వెన్నుపోటు  రాజకీయాలు..

రాజధాని పరిధిలో మొత్తం 29 శాసనసభ స్థానాలున్నాయి. వీటిలో పరిస్థితి అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రధాన పార్టీ అగ్రనేతలు నియోజకవర్గ స్థాయిలో కీలక నేతలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీలో ఉంటూనే ప్రత్యర్థికి మేలు చేసేలా వీరితో అంతర్గత ఒప్పందం చేసుకుంటున్నారు. ఒకటి రెండు కాలనీలపై ప్రభావం చూపించే నేతలకు రూ.20 లక్షల వరకు ఇచ్చారని తెలిసింది. ఒక ప్రధాన పార్టీ ఇలా దాదాపు 12 నియోజకవర్గాలకు చెందిన దాదాపు 30 మందిని మచ్చిక చేసుకున్నారని చెబుతున్నారు. విషయం తెలిసిన ప్రత్యర్థి పార్టీ కూడా కార్పొరేటర్లపై వల వేసింది. అయిదుగురు కార్పొరేటర్లకు రూ.30 లక్షల చొప్పున ఇచ్చారని స్థానిక నేతలు ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల్లోనూ వెన్నుపోటు రాజకీయం ఆ పార్టీల అగ్రనేతలకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రాజధానిలో ఓటర్లు సొంతూళ్లకు వెళ్లడం అభ్యర్థులకు కొత్త తలనొప్పి తీసుకొస్తోంది. వారంతా ఇక్కడే ఓటు వేస్తారని ఆశలు పెట్టుకున్న ఓ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.

దాదాపు రూ.వెయ్యి కోట్ల పంపిణీ?

తక్కువలో తక్కువ వేసుకున్నా బుధవారం అర్ధరాత్రి వరకు 29 నియోజకవర్గాల్లో రూ.1000 కోట్ల వరకు ఓటర్లకు పంపిణీ జరిగి ఉంటుందని అంచనా. ఇప్పటికి రెండుసార్లు డబ్బులు పంపిణీ చేసిన అభ్యర్థులు గురువారం ఉదయం ఓటింగ్‌కు వెళ్లే సమయంలో కూడా మరోసారి ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారంటే పరిస్థితి ఇట్టే విదితమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు