logo

కోటికి పైగా ఓటర్ల తీర్పు నేడే

ఓట్ల పండగకు సర్వం సిద్ధమైంది. రాజధానిలో మూడు జిల్లాలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గం కలిపి మొత్తం 29 స్థానాల్లోని ఒక కోటి 12 లక్షల ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లడమే తరువాయి.

Published : 30 Nov 2023 05:14 IST

 


గచ్చిబౌలి స్టేడియం నుంచి ఎన్నికల సామగ్రితో తరలుతున్న అధికారిణి

ఈనాడు, హైదరాబాద్‌: ఓట్ల పండగకు సర్వం సిద్ధమైంది. రాజధానిలో మూడు జిల్లాలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గం కలిపి మొత్తం 29 స్థానాల్లోని ఒక కోటి 12 లక్షల ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లడమే తరువాయి. ఈ నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ఎన్నికల యంత్రాంగం, రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి.

 విధుల్లో 60 వేల మంది..

 మూడు జిల్లాల్లో అధికారులు, సిబ్బంది కలిపి 60 వేల మంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో 10 శాతం రిజర్వులో ఉంటారు. మిగిలిన వారంతా బుధవారమే నియోజకవర్గం స్ట్రాంగ్‌ రూముల నుంచి ఎన్నికల సామగ్రిని అందుకుని, రూట్‌ బస్సుల్లో పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడే నిద్రించి, వేకువ జామున ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారు.

అక్కడ రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం

దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులు సౌకర్యంగా ఓటు వేసేలా ఆయా కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దివ్యాంగులకు ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి, పోలింగ్‌ కేంద్రం నుంచి ఇంటికి ఉచిత రవాణా వసతి కల్పించినట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ తెలిపారు. హైదరాబాద్‌లో 75 ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు, 75 మహిళా పోలింగ్‌ కేంద్రాలు, 15 దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రాలు, 15 యువ పోలింగ్‌ కేంద్రాలను ఆయా వర్గాల్లో స్ఫూర్తి నింపేందుకు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆదర్శ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం ఉంటుందనీ.. ఇతర ప్రత్యేక కేంద్రాల్లోనూ సౌకర్యాలు ఓటర్లను ఆకట్టుకుంటాయని చెప్పారు. అన్ని కేంద్రాల్లో ర్యాంపులు, చక్రాల కుర్చీలు, వాలంటీర్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

వజ్రాయుధమిది.. బాధ్యతగా కదలాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఓటు చాలా విలువైనది. వజ్రాయుధం లాంటి ఓటును కొంత అలసత్వం.. మరికొంత నిర్లక్ష్యంతో చాలా మంది వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చూపుతుంటారు. ఆస్ట్రియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్‌, చిలీ, ఈజిప్టు, ఇటలీ, స్విట్జర్లాండ్‌లాంటి 21 దేశాల్లో ఓటుహక్కు నిర్బంధం. మన దేశంలో మాత్రం.. పౌరులే బాధ్యతగా ముందుకు వచ్చి ఓటు వేయాలి. గత ఎన్నికల్లో మహా నగరంలో 48శాతం ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు.స్ట్రాంగ్‌ రూములు సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలోని పలు నియోజకవర్గాల స్ట్రాంగ్‌ రూములను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా..అధికారులను భద్రత, నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించడం, ఇతరత్రా అంశాలపై అధికారులకు వికాస్‌రాజ్‌ దిశానిర్దేశం చేశారు.

ఫొటో తీసుకోండి..గ్రూపులో పంచుకోండి

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు కొందరు వినూత్న ప్రయత్నం చేపట్టారు. కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుని సిరా చుక్కను చూపుతూ వాట్సప్‌లో ఫొటోలు పంపాలంటూ కోరుతున్నారు. ఈ ప్రచారంతో గ్రేటర్‌లో పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రూపుల్లో ఫొటో పెట్టడం వల్ల వందల మందిలో చలనం వస్తుందని అంతా ఓటేసి పోస్టు పెట్టడానికి ఆసక్తి చూపుతారని అంటున్నారు. కొందరు ప్రముఖులు సైతం ఇంట్లో పనివాళ్లకు సెలవు ప్రకటించడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకొని ఫొటో పంపాలని షరతు పెట్టారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని