logo

పోలింగ్‌ కేంద్రంలో..ఏ గంటకు ఏం జరుగుతుందంటే

పోలింగ్‌ కేంద్రంలో నమోదైన ఓట్లను ప్రిసైడింగ్‌ అధికారి ప్రతి రెండు గంటలకోసారి ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు, 11గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు, చివరగా సాయంత్రం 5గంటలకు ప్రకటిస్తారు.

Published : 30 Nov 2023 05:17 IST

దోమల్‌గూడ కేంద్రం నుంచి తరలుతున్న సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: పోలింగ్‌ కేంద్రంలో నమోదైన ఓట్లను ప్రిసైడింగ్‌ అధికారి ప్రతి రెండు గంటలకోసారి ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు, 11గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు, చివరగా సాయంత్రం 5గంటలకు ప్రకటిస్తారు. ఐదు గంటల తర్వాత కూడా పోలింగ్‌ కేంద్రంలో వరుసలోని ఓటర్లు ఓటు వేస్తారు. వారంతా ఓటేశాక రిటర్నింగ్‌ అధికారి తుది ఓటు శాతాన్ని రాత్రికి ప్రకటిస్తారు.

 ఎన్నిక పూర్తయ్యాక..

 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు ప్రక్రియ పూర్తవగానే ఈవీఎం, వీవీప్యాట్లను అధికారులు డబ్బాల్లో భద్రపరుస్తారు. రిజిస్టర్లు, ఇతర నివేదికలను పూర్తి చేసుకుంటారు. ప్రతి పది పోలింగ్‌ కేంద్రాలకు ఓ రూటు బస్సు ఉంటుంది. వరుసగా ఒక్కో పోలింగ్‌ కేంద్రం అధికారులు బస్సులో ఎక్కుతారు. అంతా కలిసి వారి ఆధ్వర్యంలోని ఈవీఎంలు, వీవీప్యాట్లను నియోజకవర్గం స్ట్రాంగ్‌ రూముకు చేరుస్తారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల యంత్రాలు వచ్చాయని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించాక.. నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా వాటిని పరిశీలించి సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అనంతరం రిటర్నింగ్‌ అధికారి స్ట్రాంగ్‌ రూముకు తాళం వేస్తారు.  

డిసెంబరు 1న..

నగరంలోని అన్ని స్ట్రాంగ్‌ రూముల రికార్డులను రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల పరిశీలకులు సరిచూస్తారు. ఏదేనీ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు ఉందా, ఉంటే ఎన్ని పోలయ్యాయో తెలుసుకుంటారు. టెండరు ఓట్లు అధికంగా ఉంటే.. ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుపుతుంది. సదరు పోలింగ్‌ కేంద్రంలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలా, వద్దా అని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. మళ్లీ ఎన్నిక అవసరమనుకుంటే డిసెంబరు 2న చేపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని