logo

గుబుల్‌ గుబుల్‌గా గుండెలధరగా..

అబ్బే.. ఇతర పార్టీల నుంచి పోటీనే లేదు. అధిక మెజార్టీతో గెలిచి తీరతాం.. ఇదీ రెండుమూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఓ నేత ధీమా.

Published : 30 Nov 2023 06:19 IST

ఓటరు మౌనం.. లీడర్‌ అంతర్మథనం

ఈనాడు, హైదరాబాద్‌: అబ్బే.. ఇతర పార్టీల నుంచి పోటీనే లేదు. అధిక మెజార్టీతో గెలిచి తీరతాం.. ఇదీ రెండుమూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఓ నేత ధీమా. ఇప్పుడా నియోజకవర్గంలో మారిన వాతావరణంతో ప్రస్తుతం స్వల్పమెజార్టీతో నెగ్గితే అదే చాలంటూ పార్టీశ్రేణులను వేడుకుంటున్నారు.

ఆ పార్టీది అక్కడ దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం. మరో పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా పూచికపుల్లగా భావించేవారు. గతానికి భిన్నంగా, తొలిసారి నియోజకవర్గ ఓటర్లు కొత్త నాయకత్వం కోరుకుంటున్నారని తెలియగానే బుజ్జగింపులు మొదలెట్టారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తంటాలు పడుతున్నారు.

ఇదీ నగరంలో అధికశాతం నేతల పరిస్థితి. సర్వేల్లో విజయం పక్కా.. అని భావించిన అభ్యర్థులు మారిన పరిణామాలతో గుబులు చెందుతున్నారు. పలువురు ప్రధానపార్టీల నేతలు ఓటరు మౌనం వెనుక అంతరార్థం గ్రహించలేక అంతర్మథనంలో ఉన్నారు. ప్రముఖులు నివాసముండే ఓ నియోజకవర్గంలోనూ ప్రధాన పార్టీ నేత భారీ మెజార్టీ ఖాయమని గతంలో అనుకోగా, ఇప్పుడు  గెలిస్తే చాలని భావిస్తున్నట్టు సమాచారం.

మనసులో ఏముందో..

ఎంత ప్రచారం చేసినా, చివరికి ఓటరు మనసులో ఏముందనేది అంచనా వేయడం సవాల్‌గా మారిందని ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి తెలిపారు. కాలనీ, కుల సంఘాల నేతలు.. తమ మద్దతుంటుందని రెండు మూడు పార్టీలవారికి చెప్పడంతో ఏ వైపు ఉంటారో నిర్ధారించలేని పరిస్థితి. కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌ల్లో ఓటరు మనసు తెలుసుకునేందుకు సర్వే చేసినా ఎవరిది గెలుపో అంచనా వేయలేకపోయామని ఓ సంస్థ వారు చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని