logo

ఒక్క ఓటు.. ఐదేళ్ల భవిత

ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తు గురువారం జరిగే పోలింగ్‌పై ఆధారపడి ఉంది. ప్రజారంజక పాలన అందించగలిగే నేతను గెలిపించుకునే తరుణమిది. ప్రజాస్వామ్యంలో  విలువైన  ఓటును సద్వినియోగం చేసుకోవాలంటే ఎన్నికల నియమావళి పాటించాల్సిందే.

Published : 30 Nov 2023 06:22 IST

ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తు గురువారం జరిగే పోలింగ్‌పై ఆధారపడి ఉంది. ప్రజారంజక పాలన అందించగలిగే నేతను గెలిపించుకునే తరుణమిది. ప్రజాస్వామ్యంలో  విలువైన  ఓటును సద్వినియోగం చేసుకోవాలంటే ఎన్నికల నియమావళి పాటించాల్సిందే. దానిగురించి తెలుసుకుందాం.

ప్రచారం నిషిద్ధం

పోలింగ్‌బూత్‌ల వద్ద పార్టీలకు చెందిన జెండాలు, గుర్తులు ప్రదర్శించకూడదు. అభ్యర్థుల చిత్రాలున్న దుస్తులు ధరించకూడదు. పార్టీలకు చెందిన పాటలు వేయకూడదు. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేపట్టేవారిపై చర్యలు తీసుకునే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు చరవాణులు పట్టుకొని వెళ్లకూడదు. ఓటు వేస్తున్నప్పుడు ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం నిషిద్ధం. జాబితాలో పేరున్న వాళ్లకే ఓటేసే అవకాశం ఉంటుంది. ఓటర్లు తప్పనిసరిగా ఎన్నికల సంఘం సూచించిన 12 ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకెళ్లాలి.

వీరికి మాత్రమే అనుమతి..

పోలింగ్‌బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.ఈ ప్రాంతంలో అల్లర్లు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్‌ జరిగే సమయంలో పోలింగ్‌ కేంద్రంలోకి కొందరికే అనుమతి ఉంటుంది. నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లొచ్చు. వీరికి ఎన్నికల అధికారి పాసులు జారీ చేస్తారు. ఓటర్లు, పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల పరిశీలకులు, ఈసీఐ ద్వారా అనుమతి పొందిన విలేకరులు, భద్రతా సిబ్బంది బూత్‌వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది.

టెండర్‌ ఓటుకు అవకాశం

ఒక వ్యక్తి ఓటేసేందుకు వెళ్లేటప్పటికే అతని ఓటును మరొకరు వేసి ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో టెండరు ఓటు వినియోగించుకోవచ్చు. ముందుగా ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఆయన పరిశీలించి.. ఓటు వేయడం వాస్తవమని తేలితే ఎన్నికల నియమావళి సెక్షన్‌ 42 ప్రకారం టెండర్‌ ఓటుకు అవకాశం ఇస్తారు. ఈ ఓటును బ్యాలెట్‌ పద్ధతిలో వేయాలి. ఈ ప్రక్రియ పీఓ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈవీఎంలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కిట్లలో టెండర్‌ ఓట్లను సైతం ఎన్నికల కమిషన్‌ అందజేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని