logo

మళ్లీ పాత కథే

మళ్లీ పాత కథే పునరావృతమైంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు మినహా మిగిలినవారు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రతి నియోజకవర్గంలో 40శాతం మంది యువ ఓటర్లే ఉన్నారు.

Published : 01 Dec 2023 01:50 IST

ఓటేసేందుకు ఆసక్తి చూపని యువ ఓటర్లు

ఈనాడు, హైదరాబాద్‌: మళ్లీ పాత కథే పునరావృతమైంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు మినహా మిగిలినవారు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రతి నియోజకవర్గంలో 40శాతం మంది యువ ఓటర్లే ఉన్నారు. వీరంతా గెలుపోటములను నిర్ణయించే స్థితిలో ఉన్నా ఓటింగ్‌కు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇందులో 18 నుంచి 21 ఏళ్ల వయసు వారు 25 శాతం, 21 నుంచి 35 ఏళ్ల వయసు వారు 35శాతం మంది ఉన్నారు. బాధ్యత గల పౌరులుగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన తరుణంలో అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఉదయం 10 గంటల వరకు 18 నుంచి 21 ఏళ్ళ వయస్సున్న ఓటర్లు పోలింగ్‌బూత్‌లకు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేసిన అనంతరం సిరాచుక్కను చూపుతూ ఓటేశామంటూ సామాజిక మాధ్యమాల్లో ఆ చిత్రాలను పంచుకున్నారు. మొత్తంగా 10 నుంచి 15 శాతం మినహా ఎవరూ ఓటేయడానికి ఆసక్తి చూపలేదు. సెలవు రోజు కావడంతో కొందరు ఇంటికే పరిమితం కాగా మరికొందరు సినిమా థియేటర్లకు వెళ్లిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లోని మైదానాలు యువకుల ఆటలతో సందడిగా కనిపించాయి. కార్పొరేట్‌ కంపెనీలు సైతం సెలవులు ప్రకటించక పోవడంతో చాలా మంది ఓటింగ్‌కు దూరమయ్యారు. కొన్ని కంపెనీలు మూడు షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు ప్రకటించకుండా ఇంటి నుంచి పని చేయాలని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) ఆదేశించాయి. కొన్ని కంపెనీలు పోలింగ్‌ తేదీనే వారాంతపు సెలవు అంటూ ప్రకటించడంతో సెలవు దొరికిందని కొందరు ఇళ్లకే పరిమితమయ్యారు.

గేటు దాటని కమ్యూనిటీలు : ఓటు వేసేందుకు గేటెడ్‌ కమ్యూనిటీలు అంతగా ఆసక్తి చూపలేదు. అపార్ట్‌మెంట్‌ మెట్టు దిగి రాలేదు. ఒక్కో కమ్యూనిటీలో వందల కుటుంబాలు ఉంటున్నాయి. వీటిలోంచి బయటికి వచ్చి ఓటు వేసిన వారు చాలా స్వల్పం. ఓటరు చైతన్యంపై ఎన్నికల కమిషన్‌, స్వతంత్ర సంస్థలు వేర్వేరు చైతన్య కార్యక్రమాలు చేపట్టినా ఎక్కువ శాతం మంది ఓటు నమోదు చేసుకోలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉండటం.. వారికి తమ సొంత రాష్ట్రాల్లో ఓటు ఉండటంతో ఇక్కడ వేయలేదని చెప్పారు. నార్సింగికి చెందిన ఒకరు ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓటు వేసినట్లు తెలిపారు. తనకు తమిళనాడులో ఓటుందని, ఇక్కడ లేదని రాజేంద్రనగర్‌లోని మరొకరు అన్నారు. తమకు ఓటు ఆంధ్రప్రదేశ్‌లో ఉందని ఇక్కడ లేదని ఎక్కువ మంది తెలిపారు. వీరంతా సిటీలోని అపార్ట్‌మెంట్లలో, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉంటున్నారు.  

అభ్యర్థులను గుర్తించడం సమస్య:  వృద్ధులు పోలింగ్‌ కేంద్రాల్లో ఇబ్బంది పడ్డారు. ఈవీఎంలలో అభ్యర్థులను వరస క్రమంలో గుర్తించలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలలున్న పోలింగ్‌ కేంద్రాల్లో ఇరుకు గదుల్లో సరిగ్గా వెలుతురు లేక అభ్యర్థులను గుర్తించడంలో పెద్దవాళ్లు సమస్యలు ఎదుర్కొన్నారు. ఈసీ దృష్టికి వెళ్లడంతో లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని