logo

సర్వేల హోరు.. బెట్టింగ్‌ జోరు

శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిందో లేదో బెట్టింగ్‌ పర్వం ఒక్కసారిగా ఊపందుకుంది. గురువారం సాయంత్రం ఓటింగ్‌ పూర్తయ్యాక పోలింగ్‌ సరళి ఆధారంగా గెలుపోటములపై ఊహాగానాలు వెలువడ్డాయి.

Published : 01 Dec 2023 02:03 IST

ఈనాడు- హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిందో లేదో బెట్టింగ్‌ పర్వం ఒక్కసారిగా ఊపందుకుంది. గురువారం సాయంత్రం ఓటింగ్‌ పూర్తయ్యాక పోలింగ్‌ సరళి ఆధారంగా గెలుపోటములపై ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ వెంటనే వివిధ సంస్థలు తమ సర్వే వివరాల్ని బయటపెట్టాయి. ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటున్న బెట్టింగ్‌ రాయుళ్లు పోటీపోటీగా పందేలు కాస్తున్నారు. ఎక్కువ సంస్థలు కచ్చితంగా గెలుస్తుందని ప్రకటించిన పార్టీలపై పందెం కాసేందుకు పోటీపడుతున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇక్కడి ఫలితాలపై ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.కోట్ల బెట్టింగ్‌ జరుగుతోంది. గురువారం పోలింగ్‌ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లోని తమ బంధువులు, స్నేహితుల ద్వారా ఇక్కడి రాజకీయ వాతావరణం తెలుసుకుంటున్నారు. దాని ఆధారంగా పందేలు కడుతున్నారు. బెట్టింగ్‌ విలువ ఊహించదానికంటే ఎక్కువే ఉంటోందని పోలీసులు పేర్కొంటున్నారు.

ఫలితాల రోజు చలో ఫాంహౌస్‌..ఎన్నికల ఫలితాలు డిసెంబరు 3న వెలువడుతాయి. ఫలితాలపై ఆసక్తి ఉన్న కొందరు నగర శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లు, వ్యవసాయ క్షేత్రాల్లో గడిపేందుకు సిద్ధమవుతున్నారు. వారాంతం కావడంతో స్నేహితులతో కలిసి ప్రయాణమవుతున్నారు. మందు, విందు మధ్య బెట్టింగ్‌లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకు బుకీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, ఫాంహౌస్‌ల బుకింగ్‌ కోసం సంప్రదిస్తున్నారని యజమానులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా హైదరాబాద్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని