logo

గెలిచేదెవరు.. ఓడేదెవరు

Published : 01 Dec 2023 02:31 IST

ఓటింగ్‌ తీరుపై అంచనాల్లో అభ్యర్థులు
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన ఎన్నికలు  
న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌, బొంరాస్‌పేట, ధారూర్‌, దోమ

జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటరు మనోగతం ఎటు మొగ్గిందోనని జిల్లా అభ్యర్థులు ఎవరికివారు లెక్కల వేస్తున్నారు. పోలింగ్‌ సరళిని బట్టి నాలుగు నియోజకవర్గాల్లో తమకంటే తమకే అనుకూలమని గట్టిగా అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు సాగిన పోలింగ్‌ సరళి తమకే అనుకూలమని ఓ పార్టీ చెబుతుంటే, మధ్యాహ్నం నుంచి తమకు అనుకూలంగా మారినట్లు మరికొందరు పేర్కొంటున్నారు. అందరికీ డబ్బులు పంపిణీ చేశామని, ఓటింగ్‌ సరళిని ప్రభావితం చేస్తుందని అన్ని పార్టీల వారు భావిస్తున్నారు.

గంపగుత్తగా మాకే పడ్డాయి..

నిరుద్యోగులు, ఉద్యోగుల, యువత, మహిళల ఓట్లు గంపగుత్తగా మాకే పడ్డాయని ఆయా పార్టీల అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయని భారాస అంచనాల్లో ఉండగా, అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల వ్యత్యాసం పెద్దగా ఉండదని అభ్యర్థుల మద్దతు దారులు చెప్పిన వివరాల ప్రకారం అంచనా వేసి గెలుపు పక్కా అంటున్నా, లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు. వీరి ఆందోళనకు తెర పడాలంటే మరో రెండు రోజుల వరకు నిరీక్షించాల్సిందే.

ఉదయం మందకొడి..

ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మందకొడిగా సాగిన ఓటింగ్‌ అనంతరం ఊపందుకుంది. గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల ఎదుట ఓటర్లు బారులు తీరి గంటల తరబడి వరుసలో నిరీక్షించారు.  

జిల్లా పోలీసు అధికారి కోటిరెడ్డి నేతృత్వంలో వికారాబాద్‌ డీఎస్పీ నర్సిములు, సీఐలు బందోబస్తును పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి నారాయణరెడ్డి పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.  

పోలింగ్‌ తీరు పరిశీలన

తాండూరు నియోజక వర్గంలో చెదురు, మదురు ఘటనలు మినహా గురువారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు పోలింగ్‌ జరుగుతున్న తీరును పరిశీలించారు.  

చిన్నచిన్న ఘటనలు

కొడంగల్‌ నియోజకవర్గంలో చిన్నచిన్న ఘటనలు తప్ప పోలింగ్‌ అంతా ప్రశాంతంగా ముగిసింది. తుంకిమెట్ల గ్రామంలో మూడు ఈవీఎమ్‌లు ఇబ్బంది పెట్టడంతో రాత్రి వరకు కొనసాగింది.

భారీ బందోబస్తు

పరిగి నియోజకవర్గంలో పోలింగ్‌ భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. వృద్ధులు  ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.


ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని అడిగి..

అభ్యర్థి గెలుస్తాడు? ఏ అభ్యర్థి ఓడుతాడనే విషయంలో నేతలు ఆరా తీస్తున్నారు. పోలీసు శాఖలో పరిచయం ఉన్న ఇంటలిజెన్స్‌ సిబ్బందిని అడిగి విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఏ సామాజిక వర్గం వారు తమ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వేశారు? ఎవరు ఓట్లు వేయలేదని ఆరా తీస్తున్నారు. తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి నియోజక వర్గాల్లోని ప్రధాన పార్టీల నేతలంతా ఇదే విషయాన్ని చర్చిస్తున్నారు. అభ్యర్థులు తమ అనుచర గణంగా ఉన్న ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మండలాల్లోని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల వారిగా పోలైన ఓట్ల గురించి చర్చించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు కొన్ని గ్రామాల్లో గంపగుత్తగా ఓట్లు పోలైతే మరి కొన్ని గ్రామాల్లో చాలా తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఈ పరిణామం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. 


పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రాత్రి 8:30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సాయంత్రం వరకు వస్తూనే ఉన్నారు. 5 గంటల లోపు ఓటు వేయడానికి వరుసలో నిల్చొని ఉన్న వారికి ఓటు వేయడానికి అనుమతించడంతో ఆలస్యమైంది. దీంతో ఓటింగ్‌ శాతంపై అధికారులు కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో జాప్యమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని