logo

పోలీసు నీడలో పోలింగ్‌

అడుగడుగునా సాయుధ బలగాలు.. పోలీసు వాహనాల పహారా.. సీసీ కెమెరాలతో డేగకళ్ల నిఘా..రాజధానిలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని 8,290 కేంద్రాల్లో ఆటంకం లేకుండా పోలింగ్‌ కొనసాగింది.

Published : 01 Dec 2023 02:40 IST

రాజధానిలో ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అడుగడుగునా సాయుధ బలగాలు.. పోలీసు వాహనాల పహారా.. సీసీ కెమెరాలతో డేగకళ్ల నిఘా..రాజధానిలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని 8,290 కేంద్రాల్లో ఆటంకం లేకుండా పోలింగ్‌ కొనసాగింది. నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ పోలింగ్‌ కేంద్రాలను సందర్శిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్‌ కోసం బుధవారం సాయంత్రం నుంచే పోలీసులు సిద్ధమయ్యారు. గురువారం తెల్లవారుజామున నుంచి అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితిని ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 391 రూట్‌ మొబైల్స్‌, 129 పెట్రోలింగ్‌ వాహనాలు, 122 ఇతర పోలీసు వాహనాలు, ఏడుగురు డీసీపీలు, 28 మంది ఏసీపీల ఆధ్వర్యంలో స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, 9 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, 9 స్పెషల్‌ ఫోర్స్‌, 71 మంది ఇన్‌స్పెక్టర్లు, 125 మంది ఎస్‌ఐలు విధుల్లో పాల్గొన్నారు. సైబరాబాద్‌లో 7 నియోజకవర్గాలకు ఏసీపీలను పోలీసు నోడల్‌ అధికారులుగా నియమించారు. 259 రూట్‌ మొబైల్స్‌, 27 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 24 స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్స్‌, 24 ఎంసీసీ బృందాలు, 103 క్యూఆర్‌టీ సత్వర స్పందన బృందాలు, 40 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు పనిచేశాయి.  

కంట్రోల్‌ రూము నుంచి రోనాల్డ్‌రాస్‌ సూచనలు : పోలింగ్‌ తీరును హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌ రూము నుంచి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సుమారు 2వేల సీసీ కెమెరాలు, ప్రతి పోలింగ్‌ కేంద్రంలోని వెబ్‌కాస్టింగ్‌ ఫుటేజీని పరిశీలించారు. వెల్లడైన నిర్వహణ లోపాలను చక్కదిద్దారు. ఎన్నికల ప్రక్రియకు సహకరించిన ఓటర్లు, అధికార యంత్రాంగం, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

నగరంలో 6000 నిఘా నేత్రాలు: నగరవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో, వాటి ఆవరణలో 6వేల సీసీ  కెమెరాలు ఏర్పాటుచేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో పరిస్థితులను అంచనా వేశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తూ సీపీ సందీప్‌శాండిల్య దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సంయుక్త సీపీ పరిమళ, డీసీపీలు పుష్ప, రాధేష్‌ మురళి, ఎస్పీ సురేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షణ, మార్గదర్శనం తదితరాలను స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా, స్పెషల్‌ జనరల్‌ అబ్జర్వర్‌ అజయ్‌ వి నాయక్‌ పరిశీలించారు. సీపీ సందీప్‌ శాండిల్యను అభినందించారు.  

అడుగడుగునా రహస్య కెమెరాలు:  ఎన్నికల వేళ.. ప్రతి ఒక్కరి కదలికలను నగర పోలీసులు కెమెరాల్లో బంధించారు. బీటెక్‌ విద్యార్థులను పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు. వైఫై సీసీ కెమెరాలను అమర్చి వాటిని  సంబంధిత ఠాణాకు అనుసంధానం చేశారు.

మూడంచెల భద్రత: ఈవీఎంలను భద్రపరిచేందుకు  పోలీసులు మూడంచెల భద్రతా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం పోలింగ్‌ పూర్తయ్యాక పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలను తరలించారు. హైదరాబాద్‌లో 15, రంగారెడ్డి-4, మేడ్చల్‌ జిల్లాలో-1 ఒకటి కలిపి మొత్తం 20 స్ట్రాంగ్‌ రూములున్నాయి. ఈ కేంద్రాల వద్ద మొదటి దశలో స్థానిక పోలీసులు, రెండో దశలో సాయుధ సిబ్బంది, మూడో దశలో పారామిలిటరీ బలగాలు గస్తీలో ఉంటాయి. ఇక్కడే ఓట్ల లెక్కింపు కేంద్రాలుంటాయి. స్ట్రాంగ్‌ రూంల వద్ద 144 సెక్షన్‌ అమలుచేస్తారు.సమీపంలో ఫైరింజన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని