logo

అక్కడక్కడ గడబిడ

నగరంలో పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటలు, పరస్పర దాడులు జరిగాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు సత్వరమే స్పందించారు.

Published : 01 Dec 2023 02:42 IST

ఈనాడు, హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌ న్యూస్‌టుడే : నగరంలో పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటలు, పరస్పర దాడులు జరిగాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు సత్వరమే స్పందించారు. గుంపులను చెదరగొట్టేందుకు వారు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. నగరవ్యాప్తంగా ఈ ఘటనలపై 150కిపైగా కేసులు నమోదు చేశారు.

ఎక్కడెక్కడంటే...

  • నాంపల్లి మాసబ్‌ట్యాంక్‌ తులసీ పాఠశాల సమీపంలో ఎంఐఎం, కాంగ్రెస్‌ నేతల మధ్య వివాదం తలెత్తింది. ఇరువర్గాలు గొడవకు దిగటంతో పోలీసులు లాఠీఛార్జి జరిపారు.
  • హబీబ్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌హుస్సేన్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేయటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • యాకుత్‌పురలో పోలింగ్‌ బూత్‌ వద్ద ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లాఖాన్‌ ఎంఐఎం నేతల చేతిలోని ఓటరు స్లిప్పులను చించడంతో గొడవ మొదలైంది. పోలీసులు అమ్జదుల్లాఖాన్‌, ఎంఐఏ నేత అరాఫత్‌పై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.
  • కిషన్‌బాగ్‌లోని ఒక పాఠశాల వద్ద  ఎంఐఎం, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. పోలీసులు కేసులు నమోదు చేశారు.
  • భవానీనగర్‌ పరిధిలో ఇద్దరు వ్యక్తులు పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. అదుపులోకి తీసుకోబోగా తిరగబడటంతో కేసులు నమోదు చేశారు.
  • బంజారాహిల్స్‌లో ఓ బూత్‌లో భారాస, భాజపా శ్రేణుల  వివాదం తోపులాటకు దారితీయగా పోలీసులు సర్దిచెప్పారు
  • మణికొండలో డబ్బు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో ఇరుపార్టీలు గొడవకు దిగాయి. ఒకర్నొకరు తిట్టుకుంటూ భౌతికదాడికి దిగారు. కుర్చీలు, బల్లలు ధ్వంసం చేశారు.
  • గోషామహల్‌లో ఓటేసేందుకు వెళ్తున్న యువకుడిని గుర్తింపుకార్డు అడిగిన మహిళా ఎస్సైపై దాడికి పాల్పడ్డాడు.
  • జగద్గిరిగుట్ట మగ్ధుంనగర్‌లో ఈవీఎంలు మార్చారనే వదంతులతో స్థానికులు ఆందోళనకు దిగారు.
  • కవాడిగూడలోని విద్యావిహార్‌ హైస్కూల్‌లో ఈవీఎంలు పనిచేయట్లేదంటూ ఓటర్లను బయటకు పంపిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
  • సైదాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అక్బర్‌పై ఎంఐఎం నాయకులు దాడి చేశారు. అదే ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థిపై కొందరు యువకులు దాడిచేశారు. పోలీసులు లాఠీఛార్జి చేసి బాధితులను సురక్షితంగా పంపారు. కేసు నమోదుచేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని