logo

ఎవరి లెక్కలు వారివే..!

పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కావడం, ఫలితాలకు మరో 24 గంటలు సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలతో కుస్తీ పడుతున్నారు.

Published : 02 Dec 2023 01:35 IST

తలమునకలవుతున్న నేతలు
గెలుపు ధీమాపై భారీ బెట్టింగులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, బొంరాస్‌పేట: పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కావడం, ఫలితాలకు మరో 24 గంటలు సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలతో కుస్తీ పడుతున్నారు. మండల స్థాయి నాయకులు తమ మండలాల్లో పోలైన ఓట్లు, ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో సూచనప్రాయంగా లెక్క వేస్తున్నారు.

కేంద్రాల వారీగా అంచనాలు

జిల్లాలో పరిగి, కొడంగల్‌, తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో భారాస, కాంగ్రెస్‌, భాజపా, బీఎస్పీ అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. కొన్ని చోట్ల స్వతంత్రులు సైతం పోటీలో నిలబడినా ప్రధానంగా పోటీ భారాస, కాంగ్రెస్‌, భాజపాల మధ్యేనని గుర్తించారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలింగ్‌ సరళిని బట్టి గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభిమానులు, కార్యకర్తలు తమ నేతలు గెలుస్తారని బెట్టింగులు వేస్తున్నారు.

మహిళలు, రైతులు, యువత ఎవరి వైపు మొగ్గు చూపారనేది అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో మద్దతిచ్చిన ఓ వర్గం ఈసారి ఎటు మొగ్గు చూపారన్నది అంతుపట్టక తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు పైకి గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నా, లోపల మాత్రం ఈ నెల 3న వెలువడే ఫలితాల పైనే ఆశలు పెట్టుకుంటున్నారు.

రూ.లక్షల్లోనే..: కొడంగల్‌ శాసనసభ ఫలితాలపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. ఇందులో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస పార్టీల మీద రూ.లక్షల్లో ఈ బెట్టింగులు పెడుతున్నారు. 

హోరా హోరీ పోరు

వికారాబాద్‌, పరిగి, తాండూర్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరిగింది. ఎన్నికల ప్రచారం మొదలు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఓటర్ల తీరును బట్టి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయనే అంచనాలతో కూడికలు, తీసివేతలతో గెలుపు అంతరాన్ని నిర్ణయిస్తున్నారు. మరోవైపు టీవీల్లో ప్రసారమైన ఎగ్జిట్‌ పోల్స్‌ కొంతమందిలో ఆశలు నింపగా, మరి కొందరు అభ్యర్థులను అసంతృప్తికి గురి చేశాయి.

21 మంది పోటీ: తాండూరు శాసన సభ నియోజక వర్గానికి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా 21 మంది పోటీ చేశారు. అయితే ప్రధాన పోటీ భారాస, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే జరిగింది. మూడు, నాలుగో స్థానాల్లో మాత్రమే మరో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది.

ఎటువైపు మొగ్గారోనని..

అల్ప సంఖ్యాకులుగా ఉన్న ఓటర్లు ఎటు వైపు మొగ్గితే వారే విజయం సాధించ బోతున్నారనే రాజకీయ చర్చ తీవ్రంగా సాగుతుంది. ఎన్నికలు జరగడానికి రెండు మూడు రోజుల ముందు ఓ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఎన్నికలు జరిగే రోజు మాత్రం వీరంతా మరో ప్రధాన పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అల్పసంఖ్యాకుల ఓటర్లు తమ వైపే ఎక్కువగా మొగ్గు చూపారని మరో పార్టీ భావిస్తోంది.

పల్లెల్లో పోలింగ్‌పైనే చర్చలు

పోలింగ్‌ మరుసటి రోజంతా గ్రామాల్లో ఓటింగ్‌ విధానంపైనే చర్చలు సాగాయి. ఎక్కడ నలుగురు కలిసినా అక్కడి ఊరులో ఇంత మెజార్టీ వస్తే కాదు మరో ఊరులో మోసం చేశారని ఇలా... పలు విధాలుగా శుక్రవారం మాట్లాడుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని