logo

ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన

పరిగిలో జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఏర్పాట్ల పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, ఎన్నికల పరిశీలకులు సుధాకర్‌గార్గె, ఆకాష్‌ పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న పనులను నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి విజయకుమారిని అడిగి తెలుసుకున్నారు.

Published : 02 Dec 2023 01:38 IST

భద్రతా ఏర్పాట్లకు చర్యలు

లెక్కింపు ఏర్పాట్ల వివరాలు తెలుసుకుంటున్న పరిశీలకులు సుధాకర్‌గార్గె, కలెక్టర్‌ నారాయణరెడ్డి

పరిగి, న్యూస్‌టుడే: పరిగిలో జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఏర్పాట్ల పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, ఎన్నికల పరిశీలకులు సుధాకర్‌గార్గె, ఆకాష్‌ పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న పనులను నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి విజయకుమారిని అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలను వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో స్క్రూటినీ నిర్వహించి స్ట్రాంగ్‌ రూంలో భద్ర పరిచి సీల్‌ వేశారు. కార్యక్రమంలో రాహుల్‌శర్మ, లింగ్యానాయక్‌, విజయకుమారి,  శ్రీనివాసరావు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు. డీఎస్పీలు కరుణాసాగర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, సీఐ వెంకట్రామయ్యతో కలిసి ఎస్పీ చర్చించారు.

నాలుగు నియోజక వర్గాలవి..: జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఈసారి పరిగిలోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానిక మార్కెట్‌ యార్డును ఎంపిక చేసి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 

కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

యార్డును ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు

ఈనెల 3న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో పోలీసులు మార్కెట్‌ యార్డు ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రెండు రోజులుగా యార్డు పరిసరాల్లో ఎవరినీ లోపలకు రానీయకుండా ఉండేందుకు చుట్టూరా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ఈవీఎంల తరలింపు: కొడంగల్‌ నియోజకవర్గంలో ఓటర్లు ఓటేసిన ఈవీఎంలను శుక్రవారం ఎన్నికల అధికారులు పరిగికి తరలించి భద్రపరిచారు. వివిధ ప్రాంతాల నుంచి ఈవీఎంలు గురువారం అర్ధరాత్రి రావడంతో ఈవీఎంలను శుక్రవారం ఉదయం తరలించినట్లు ఎన్నికల అధికారి లింగ్యానాయక్‌ తెలిపారు. రెండు ప్రధాన పార్టీల నాయకుల ఎదుట భద్ర పరిచిన అనంతరం పోలీసు భద్రత మధ్య పంపించామన్నారు. 

తాండూరు శాసన సభ నియోజకవార్గనికి గురువారం ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే అధికారులు ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్లను తాండూరులోని సెంట్‌ మార్క్స్‌ ఉన్నత పాఠశాలకు తరలించారు. అక్కడ వాటిని నిశితంగా పరిశీలించే సరికి రాత్రి ఒంటి గంట దాటింది. శుక్రవారం ఉదయం పరిగిలోని స్ట్రాంగ్‌రూమ్‌కు బస్సుల్లో పోలీసు బందో బస్తు మధ్య తరలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సాయుధ] పోలీసులు 24 గంటల బందో బస్తు నిర్వహిస్తున్నారు.

తాండూరు స్ట్రాంగ్‌ రూం వద్ద సాయుధ పోలీసు, ఎన్నికల అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని