logo

పక్కా ప్రణాళిక.. పటిష్ఠ కార్యాచరణ

జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం, పార్టీల అభ్యర్థులు గొడవ పడటం వంటి స్వల్ప ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

Published : 02 Dec 2023 01:40 IST

ఫలించిన ఎన్నికల సిబ్బంది కృషి
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పరిశీలన తెరలు 

జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం, పార్టీల అభ్యర్థులు గొడవ పడటం వంటి స్వల్ప ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. రీ పోలింగ్‌ అనే మాటే లేకుండా అత్యంత సమర్థంగా ఎన్నికల నిర్వహణ సాగింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ జరిగినా సమస్యలు తలెత్తలేదు. దీంతో ప్రజలు అధికారుల తీరును ప్రశంసించారు. ఈ భగీరథ యత్నం సాఫీగా సాగడంలో కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి కలెక్టర్‌ వరకు అందరి కృషి దాగి ఉంది. దీనిపై ‘న్యూస్‌టుడే’ కథనం

ప్రకటన వెలువడిన నాటినుంచే..

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నాటి నుంచే సిబ్బంది ఎన్నికల విధుల్లోకి వచ్చేశారు. చివరి ఓటు పోలయ్యే వరకు ప్రతి అధికారి తమ వంతుగా శ్రమించారు. సుమారు రెండు నెలలు పాటు అధికారులు ఎన్నికల విధుల్లోనే ఉన్నారు. 

ఓటర్లలో చైతన్యానికి కృషి: ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఓటర్లను చైతన్యం చేయడానికి స్వీప్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందుగానే జిల్లాలో స్వీప్‌ నోడల్‌ అధికారులను, కోఆర్డినేటర్లను నియమించారు. నూటికి నూరు శాతం ఓటింగ్‌ను సాధించటానికి అధికారులు కృషి చేశారు. దీని కోసం డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. 

సమైక్య కృషితోనే సాధించాం: కలెక్టర్‌

జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌ జరగానికి పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బంది కృషి దాగింది. అందరి సమైక్య కృషితోనే ఈ క్రతువు నిర్వహించగలిగాం. అవసరం మేరకు సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించటంతో మరింత ప్రయోజనం కలిగింది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అభినందిస్తున్నాం.

ఫిర్యాదులపై స్పందన

ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా డయల్‌ 1950, సి-విజల్‌, సువిధ యాప్‌ ద్వారా స్వీకరించారు. ఎప్పటికప్పుడు రికార్డు చేసి పరిష్కారం చూపారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఏంచేయాలి, చేయకూడదు అనేవి అధికారులు ఎప్పటికప్పుడు ఆయా పార్టీల ప్రతినిధులకు సమావేశాలను ఏర్పాటు చేసి వివరించారు. 

వెబ్‌కాస్టింగ్‌, సాంకేతికత తోడు

జిల్లాలో ఒక్కొక్క పోలింగ్‌ ప్రాంతంలో ఒక వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బందిని నియమించారు. వెబ్‌ కాస్టింగ్‌ సక్రంగా జరుగుతుందా అని వీరు ఎప్పటికప్పుడు పరిశీలించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సిల్వర్‌ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి పోలింగ్‌ కేంద్రాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. వెబ్‌ కాస్టింగ్‌ను ప్రత్యేకంగా 599 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

సామగ్రి, పరిశీలకుల ఏర్పాటు

ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని గుర్తించటం వాటిని సమకూర్చుకోవటానికి ప్రత్యేకంగా సామగ్రి విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నికల పరిశీలకులు జిల్లాకు వచ్చినప్పుడు వారికి తగిన ఏర్పాట్లు చేయటానికి పరిశీలన విభాగం అందుబాటులోకి తెచ్చారు. అధికారుల రవాణాకు, ఈవీఎంల నిర్వహణకు, శాంతి భద్రతల పరిరక్షణకు, శిక్షణకు కమిటీలను ఏర్పాటు చేశారు.


అవగాహనకు శిక్షణ విభాగం ఏర్పాటు

విడివిడిగా విభాగాలను ఏర్పాటు చేసి వారికి బాధ్యతలను అప్పగించారు. ముఖ్యంగా ఉద్యోగుల పే స్కేల్‌ను పరిగణలోకి తీసుకుని పోలింగ్‌ కేంద్రాల్లో వివిధ స్థాయిలో అధికారులుగా నియమించారు. జిల్లాలో 1133 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 9,60,376 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులకు సృష్టమైన అవగాహన కల్పించటానికి శిక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

నాలుగు నియోజక వర్గాలకు నలుగురు రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులును నియమించారు. అన్ని విభాగాల్లో కలిపి సుమారుగా 8600 మందిని ఎన్నికల్లో వినియోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని