logo

బోగస్‌ ఓట్లకు పథకం.. ముగ్గురి అరెస్టు

అసెంబ్లీ ఎన్నికల్లో బోగస్‌ ఓట్లు వేసేందుకు పథకం రచించిన ముగ్గురిని టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నంలోని తన కార్యాలయంలో డీసీపీ బాలస్వామి, టాస్క్‌ఫోర్సు డీసీపీ నికితా పంత్‌ వివరాలు వెల్లడించారు.

Updated : 02 Dec 2023 03:16 IST

అరెస్టయిన నిందితులు

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో బోగస్‌ ఓట్లు వేసేందుకు పథకం రచించిన ముగ్గురిని టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నంలోని తన కార్యాలయంలో డీసీపీ బాలస్వామి, టాస్క్‌ఫోర్సు డీసీపీ నికితా పంత్‌ వివరాలు వెల్లడించారు. గురువారం పోలింగ్‌ రోజున నాంపల్లిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ ప్రార్థనా స్థలానికి చెందిన షట్టర్‌లో బోగస్‌ ఓట్లు వేయించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడి వెళ్లి తనిఖీ చేసి 67 నకిలీ ఓటర్‌ కార్డులు, ఓటర్‌ జాబితా, మినీ ప్రింటింగ్‌ యంత్రం, టూత్‌ పేస్టు, సిరా(ఇంకు)ను చెరిపివేసే రసాయనాలు కలిగిన సీసాలు గుర్తించారు. షట్టర్‌లో ఉన్న నిందితులు నాంపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జకీర్‌, నాంపల్లి మార్కెట్‌ నివాసి మహ్మద్‌ షాబుద్దీన్‌, విజయనగర్‌కాలనీకి చెందిన రితేష్‌ గుప్తాలను అరెస్టు చేశారు. 123 నెంబరు పోలింగ్‌ బూత్‌ పరిధిలో నివాసం ఉండి, ఇళ్లు ఖాళీ చేసిన వారి వివరాలను సేకరించి బయటి వ్యక్తుల సహాయంతో బోగస్‌ ఓట్లు వేసేందుకు పథకం పన్నినట్లు నిందితులు చెప్పారు. సమగ్ర విచారణ కోసం వీరిని హబీబ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని