logo

పెళ్లి వలకు చిక్కొద్దే బాలా!

బేగంపేటలోని విశ్రాంత ఉద్యోగికి ఇద్దరు ఆడపిల్లలు. ఓ వెబ్‌పోర్టల్‌లో వారి వివరాలు ఇచ్చారు. చిన్న కుమార్తె నచ్చిందంటూ తండ్రికి ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు  వచ్చాడని, వెంటనే పెళ్లి చేసి పంపాలన్నాడు.

Published : 02 Dec 2023 01:56 IST

వివాహ వేదికలే కేంద్రంగా మాయగాళ్ల పన్నాగాలు

బేగంపేటలోని విశ్రాంత ఉద్యోగికి ఇద్దరు ఆడపిల్లలు. ఓ వెబ్‌పోర్టల్‌లో వారి వివరాలు ఇచ్చారు. చిన్న కుమార్తె నచ్చిందంటూ తండ్రికి ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు  వచ్చాడని, వెంటనే పెళ్లి చేసి పంపాలన్నాడు. కట్నం వద్దని, బంగారు ఆభరణాలు చేయించాలంటూ రూ.26 లక్షలు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. పెళ్లిచూపులు కొత్తగూడెంలోని హోటల్‌లో చేద్దామన్నారు. వీళ్లు అక్కడకు వెళ్లాక సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేశారు.

ఈడొచ్చిన ఆడపిల్లకు సరైన జోడు వెతకాలని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. నచ్చిన భాగస్వామి దొరికితే జీవితం ఆనందంగా సాగుతుందనేది అమ్మాయిల అంతరంగం. ఇటువంటి ఆశలను మాయగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ముఖం చూపకుండానే రూ.లక్షలు కొట్టేస్తున్నారు. నగరంలో పది నెలల వ్యవధిలో పెళ్లి పేరిట 30 మంది మోసపోయారు. సుమారు రూ.2 కోట్లు పోగొట్టుకొన్నారు. సైబర్‌ నేరగాళ్లు, నైజీరియన్లు, నిత్య పెళ్లి కొడుకుల గిమ్మిక్కులకు చిక్కి నష్టపోయి మనోవేదనకు గురికావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి వారిపై గురి పెడతారంటే..

కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యంగా వివాహానికి సిద్ధమైన యువతులు.. భర్తకు దూరమై ఒంటరిగా ఉన్న మహిళలు.. విదేశీ సంబంధాలు కోరుకునే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటారు. మ్యాట్రిమోనీ సైట్లు, సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఫొటోలు, వివరాలతో.. తోడు కోసం వెతికే వాళ్లను ఎంపిక చేసుకుంటారు. విదేశాల్లో ఉన్నట్టు నమ్మించేందుకు ఆయా దేశాల సిమ్‌ కార్డులను ఉపయోగిస్తారు.  వాట్సప్‌లో ఛాటింగ్‌ చేసి మానసికంగా దగ్గరవుతారు. ఇక నాటకాన్ని షురూ చేస్తారు. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళ (36)కు మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా డాక్టర్‌ పరిచయమయ్యాడు. పెళ్లికి ముందు ల్యాప్‌ట్యాప్‌, బంగారుగొలుసు పంపుతున్నానంటూ నమ్మించాడు. దిల్లీలో జీఎస్‌టీ చెల్లించాంటూ రూ.4లక్షలు కాజేశాడు. సికింద్రాబాద్‌కు చెందిన విడాకులు తీసుకున్న, ఇద్దరు పిల్లలున్న మహిళను పెళ్లి చేసుకుంటానంటూ మ్యాట్రిమోనీ యాప్‌ ద్వారా పరిచయమైన వ్యక్తి భరోసా ఇచ్చాడు. ఇంగ్లండ్‌ నుంచి ఇండియాకు వచ్చానని ఫోన్‌ చేశాడు. 80 వేల పౌండ్లతో వచ్చిన తనను దిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో అదుపులోకి తీసుకున్నారంటూ బాధితురాలి నుంచి రూ.1.50 లక్షలు కొట్టేశాడు.


మాయమాటలతో బోల్తాపడొద్దు

- బండారి రవీందర్‌, ఏసీపీ మహంకాళి

వివాహ పరిచయ వేదికలు, యాప్స్‌, మ్యాట్రిమోనీ సైట్లలో ఫొటోలు, వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించాక నిర్ణయం తీసుకోండి. అధికశాతం ఒంటరి మహిళలు, ఆలస్యంగా వివాహం చేసుకునేవారే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్లలో సంభాషణలు, చాటింగ్‌లను విశ్వసించవద్దు. వరుడు, కుటుంబం గురించి విచారించాకే నిర్ణయం తీసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని