logo

బాతాఖానీ.. ఖాతా ఖాళీ

హుమాయున్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి వాట్సాప్‌ నంబరుకు లింక్‌ వచ్చింది. క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతాకు పాన్‌కార్డు జత చేయకుంటే సేవలు నిలిపివేస్తామంటూ సారాంశం. కంగారుపడిన ఆయన డెబిట్‌కార్డు నెంబరు, ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో రూ.1.33 లక్షలు లాగేశారు.

Updated : 02 Dec 2023 03:14 IST

సేవలు నిలిపేస్తామంటూ లింక్‌లు పంపి.. ఓటీపీలు అడిగి దోచుకుంటున్న మాయగాళ్లు
5 రాష్ట్రాలకు విస్తరించిన జాంతారా ముఠాలు

హుమాయున్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి వాట్సాప్‌ నంబరుకు లింక్‌ వచ్చింది. క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతాకు పాన్‌కార్డు జత చేయకుంటే సేవలు నిలిపివేస్తామంటూ సారాంశం. కంగారుపడిన ఆయన డెబిట్‌కార్డు నెంబరు, ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో రూ.1.33 లక్షలు లాగేశారు.

లక్డీకపూల్‌లోని వ్యాపారి మొబైల్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేశారు. పాన్‌కార్డు నంబర్‌ను బ్యాంకు ఖాతాకు అప్‌డేట్‌ చేసుకోవాలని చెప్పడంతో ఆయన ఆన్‌లైన్‌లో వివరాలు నింపారు. బ్యాంకు ఛార్జీల పేరుతో రూ.10 చెల్లించి ఓటీపీ చెప్పారు. రూ.2 లక్షలు పోగొట్టుకున్నారు.

సైదాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి ఫోన్‌ నెంబర్‌కు కస్టమర్‌కేర్‌ నుంచి ఫోన్‌ చేశారు. బ్యాంక్‌ ఖాతా సేవలు నిలిచిపోయాయని పునరుద్ధరించేందుకు బ్యాంకు వివరాలు అడగటంతో ఆయన చెప్పేశారు. ఎనీడెస్క్‌ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేయించి రూ.3.50లక్షలు కాజేశారు.

సికింద్రాబాద్‌లో ఉంటున్న చిరువ్యాపారికి ఉదయాన్నే ఫోన్‌కాల్‌ వచ్చింది. క్రెడిట్‌కార్డు పరిమితిని పెంచుతామంటూ లింకు పంపారు. దాన్ని క్లిక్‌ చేసి అట్నుంచి అడిగిన వివరాలు, ఓటీపీ పంచుకున్నాడు. అంతే రెండు దఫాలుగా రూ.లక్షతో ఇ-కామర్స్‌ ద్వారా వస్తువులు కొనుగోలు చేశారు.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కరోనా అనంతరం  డిజిటల్‌ లావాదేవీలు క్రెడిట్‌/డెబిట్‌కార్డులు వినియోగాలు తప్పనిసరి కావడంతో మాయగాళ్లు సామాన్యులను హడలెత్తిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలో 10 నెలల వ్యవధిలోనే సుమారు 5వేలకు పైగా సైబర్‌ కేసులు నమోదైనట్లు అంచనా. వీటిలో కస్టమర్‌కేర్‌ సెంటర్‌, ఓటీపీ ద్వారా సొమ్ము పోగొట్టుకున్నవి, పాన్‌కార్డు అప్‌డేట్‌, పాన్‌ నంబర్లకు ఖాతా లింక్‌ చేస్తామంటే నమ్మి మోసపోయిన కేసులు 1500 మందికి పైగా ఉన్నాయి. ఎనీడెస్క్‌/వ్యూయర్‌ యాప్‌ల ద్వారా బాధితుల సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. బ్యాంకు ఖాతా నెంబరు, ఓటీపీలతో సొమ్మంతా స్వాహా చేస్తుంటారు.  బాధితుల్లో విశ్రాంత ఉద్యోగులు, విద్యావంతులు, ఐటీ నిపుణులు, గృహిణులు, వ్యాపారులు అధికశాతం ఉంటున్నారు. కొట్టేసిన నగదును నిందితులు క్రిప్టో కరెన్సీగా మార్చి డిజిటల్‌ హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారు.

లింకులను క్లిక్‌ చేయొద్దు

  • గుర్తుతెలియని వ్యక్తులు/సంస్థల పేరుతో ఫోన్లు, వాట్సాప్‌లకు వచ్చే లింకులను క్లిక్‌ చేయవద్దు.
  • ఒక్కసారి పాన్‌కార్డు నంబరు వచ్చాక జీవితకాలం అదే కొనసాగుతుంది. ఆప్‌డేట్‌ చేయడం ఉండదు.
  • బ్యాంకు ఖాతాలతో పాన్‌కార్డు అనుసంధానించాలని ఫోన్‌ వస్తే సంబంధిత బ్యాంకుకు నేరుగా వెళ్లి అధికారులను సంప్రదించండి.
  • సైబర్‌ నేరం బారిన పడితే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేయాలి. మాయగాళ్ల ఖాతాను స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.

కేటుగాళ్లు ఎవరో తెలుసా?

నామమాత్రం చదువులు.. ఆకతాయిగా తిరిగే కుర్రాళ్లు.. ఒంటికి చెమట పట్టకుండా రూ.లక్షలు కొట్టేస్తున్నారు. గతంలో ఝార్ఖండ్‌ జాంతారాకే పరిమితమైన వీరు పాన్‌ఇండియాగా విస్తరించారు. బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌ల్లో ముఠాలుగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. భరత్‌పూర్‌, పట్నా, బెగుసరాయ్‌, ధన్‌బాగ్‌, కోల్‌కతా నుంచి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాలు, పాన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. రోజూ ఒక్కొక్కరు సుమారు 200-300 ఫిషింగ్‌ సందేశాలు, మెయిల్స్‌ పంపుతుంటారు. లావాదేవీలు నిలిపివేస్తారనే ఆందోళనతో లింకులను క్లిక్‌ చేసిన వారి బలహీనతను ఆసరా చేసుకొని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిందితుల ఖాతాలను స్తంభింపజేసినా అప్పటికే నగదు వేర్వేరు ఖాతాల్లోకి చేరిపోతుంది.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు