logo

ఈవీఎంలలో బలాలు.. బయట బలగాలు

శాసనసభ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేసిన యంత్రాంగం.. ఓట్ల లెక్కింపు కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థుల భవిష్యత్తును నిక్షిప్తం చేసుకున్న ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్‌రూంలో భద్రంగా ఉంచారు.

Published : 02 Dec 2023 02:01 IST

కౌంటింగ్‌ వేళ నిషేధాజ్ఞలు
3న మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల మూసివేత

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేసిన యంత్రాంగం.. ఓట్ల లెక్కింపు కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థుల భవిష్యత్తును నిక్షిప్తం చేసుకున్న ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్‌రూంలో భద్రంగా ఉంచారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల పోలీస్‌ బలగాలను మోహరించారు. కొత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.

కేంద్ర, రాష్ట్ర పోలీసుల పహారా..

ఈవీఎం యంత్రాలను పంపిణీ చేసిన కేంద్రాలనే ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు ఎంపిక చేశారు. ఈవీఎం పంపిణీ కేంద్రాలకు పక్కనే లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను ఉంచాక వాటి భద్రతను రిటర్నింగ్‌ అధికారికి అప్పగించారు. ఆర్వో సూచనతో లెక్కింపు కేంద్రం వద్ద సశస్త్ర సీమ బల్‌ బలగాలు, తెలంగాణ ప్రత్యేక పోలీస్‌ సాయుధ బలగాలు, పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ పోలీసులను నియమించారు. ఒక్కో కేంద్రం వద్ద ఒక ప్లటూన్‌ సశస్త్ర సీమ బల్‌ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. వీరికి అక్కడే వసతి కల్పించారు. నిరంతర భద్రత ఉన్నా.. అనుమానాస్పద సంఘటనలు, వ్యక్తులు సంచరిస్తే వెంటనే గుర్తించేందుకు చుట్టూ సీసీ కెమెరాలను అమర్చారు.

ఫలితాలు.. భావోద్వేగాలు

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఫలితాలు వెలువడం మొదలు కాగానే అభ్యర్థులు, రాజకీయపార్టీల నాయకులు భావోద్వేగాలకు లోనై హడావుడి సృష్టించడం, బాణసంచా కాల్చకుండా నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా హంగామా సృష్టించినా.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలను రద్దీలేని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నాయకులు, అభ్యర్థులు గొడవలు సృష్టించినా, పోలీసులు వారిని పట్టుకునేందుకు వీలుగా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియం, సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం వంటివాటిలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. సమస్యాత్మక నియోజకవర్గాల లెక్కింపును మైదానాలు, స్టేడియంలలో ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు, వారి అనుచరులు వందల సంఖ్యలో వచ్చినా వాహనాలు ఉంచేందుకు పార్కింగ్‌ వసతిని కల్పించారు.

నగరంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని నగర సీపీ సందీప్‌శాండిల్య శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో 15 కౌంటింగ్‌ కేంద్రాలున్నట్లు పేర్కొన్నారు. నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు.  ఐదుగురు, అంతకుమించి వ్యక్తులు ఒకేచోట గుమికూడదన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు కిలోమీటరు దూరంగా జెండాలు, కర్రలు, పేలుడు పదార్థాలు, గుమికూడటం, సమావేశాలు నిర్వహించకూడదన్నారు.  ప్రజలను ఉద్దేశించి మైకుల్లో ప్రచారం, సమావేశాలు, ఆటపాటలు నిర్వహించకూడదని స్పష్టంచేశారు. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా నగరంలో 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేశారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్‌ హోటళ్లకు నిబంధన వర్తిసుందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ భద్రత

నాంపల్లిలో లెక్కింపు కేంద్రం వద్ద బందోబస్తు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఆదివారం ఎన్నికల లెక్కింపునకు పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయనుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చేపట్టిన ప్రణాళిక సానుకూల ఫలితాన్నిచ్చింది. నగర సీపీ సందీప్‌శాండిల్య క్షేత్రస్థాయిలో పలు పోలింగ్‌ కేంద్రాలను చుట్టొస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గతంలో గొడవలు జరిగిన బోరబండ, మురాద్‌నగర్‌, ఆసిఫ్‌నగర్‌, నాంపల్లి, యాకుత్‌పుర, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో ఈ దఫా ప్రశాంతంగా పోలింగ్‌ ముగియటంతో అక్కడి డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లను సీపీ అభినందించారు. ఎన్నికల ఫలితం వెలువడే రోజున కూడా ఇదే స్ఫూర్తితో బందోబస్తు విధులు నిర్వర్తించాలని సూచించారు. నగరవ్యాప్తంగా హాట్‌స్పాట్స్‌ వద్ద అదనపు బలగాలను రంగంలోకి దింపనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచే రాజకీయపార్టీల కార్యాలయాలు, అధికార, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుల నివాసాలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నివాసాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచారు. బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని